
రజక మహిళ హత్యపై ఆగ్రహం
● కలెక్టరేట్ ఎదుట రజక సంఘాల ధర్నా
విజయనగరం అర్బన్: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామంలో ఇటీవల రజక మహిళ హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని రజక సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐక్యవేదిక సభ్యులు శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ నెల 4న గ్రామంలో పెత్తందారులు రజకులపై దాడి చేసి అరసవిల్లి హరమ్మ అనే మహిళను దారుణంగా హతమార్చి, మరో ఐదుగురిని తీవ్రంగా గాయపరిచారన్నారు. రజకుల రక్షణ కోసం ప్రభుత్వం వెంటనే ప్రత్యేక భద్రతా చట్టాన్ని రూపొందించాలని, బాధిత కుటుంబాలకు తగిన నష్ట పరిహారం చెల్లించాలని గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అనంతరం డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రజక సమాఖ్య అధ్యక్షుడు గురజాపు సత్యారావు, ఆంధ్రప్రదేశ్ రజక సేవా సంఘం అధ్యక్షుడు కెల్లా సత్యం, మద్ది పైడిరాజు, తామాడ అచ్చన్న, కొత్తకోట భవాని, ముత్యాల సత్యవతి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.