
చెరువులో పడి వ్యక్తి మృతి
భోగాపురం: మండలంలోని సవరవిల్లి పంచాయతీ బుగతపేట గ్రామానికి చెందిన బుగత లక్ష్మణ్(42) ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఆదివారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుగతపేట గ్రామానికి చెందిన బుగత లక్ష్మణ్ కొబ్బరి తోటల్లో కొబ్బరి కాయలు తీసుకుంటూ వచ్చిన డబ్బులతో కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా ఆయన అనా రోగ్యంతో బాధపడుతుండడంతో ఆ బాధను తట్టుకోలేక ఇంట్లో కేకలు వేయడం మొదలుపెట్టాడు. దీంతో అతనికి ఏదో గాలి పట్టిందని అందువల్లే ఇలా ప్రవర్తిస్తున్నాడని కుటుంబసభ్యులు భావించారు. ఈ క్రమంలో లక్ష్మణ్ బహిర్భూమికి వెళ్తానని చెప్పి శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. బయటకు వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. ఆదివారం మధ్యాహ్నం రాజ్‌కమల్ పౌల్ట్రీ సమీపంలో ఉన్న చెరువులో లక్ష్మణ్ శవమై తేలాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు. మృతుని తమ్ము డు యరకయ్య ఫిర్యాదు మేరకు ఎస్సై సూర్యకుమారి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సీతానగరం: మండలంలో విశాఖ–రాయగడ రైల్వేలైన్‌లో సీతానగరం మండలం మరిపివలస వద్ద గేటు దాటుతుండగా ఆదివారం సాయంత్రం రైలు ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై పార్వతీపురం రైల్వే పోలీస్ రత్నకుమార్ తెలిపిన వివరాలిల మేరకు ట్రైన్ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు వచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పరిశీలించి చుట్టు పక్కల గ్రామాలకు తెలియజేయగా మృతుడిని మండలంలోని నిడగల్లు గ్రామానికి చెందిన పప్పల సూర్యనారాయణ(58)గా గుర్తించారన్నారు. మృతదేహాన్ని పార్వతీపురం ప్రభుత్వ జిల్లాకేంద్రాస్పత్రికి తరలించినట్లు తెలియజేశారు.