
రాణికట్ వ్యాధితోనే లక్షలాది కోళ్ల మృతి
● పశువర్థకశాఖ ఎ.డి కన్నంనాయుడు
కొత్తవలస: ఇటీవల కొత్తవలస, లక్కవరపుకోట మండలాల్లో అంతుచిక్కని వ్యాధితో లక్షలాది కోళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా కోళ్లు రాణికట్ వ్యాధితోనే చనిపోతున్నాయని ఈ మేరకు విజయవాడ సెంట్రల్ లేబొరేటరీ నుంచి నివేదికలు అందాయని పశువర్ధకశాఖ కొత్తవలస ఎ.డి కన్నంనాయుడు శనివారం తెలిపారు. కోళ్ల మృతికి బర్డ్‌ప్లూ కారణం కావని నిర్ధారణ జరిగినట్లు చెప్పారు. లక్షలాది కోళ్ల మృతికి కారణం రాణికట్ వ్యాధే కారణమని స్పష్టం చేశారు. దీనివల్ల ప్రజార్యోగానికి ఎటువంటి ముప్పులేదన్నారు. కాగా మరోపక్క కోళ్ల మృతులు మాత్రం ఆగడం లేదు. పౌల్ట్రీ కోళ్ల కన్నా దేశవాళీ కోళ్లే అధిక సంఖ్యలో మృతి చెందుతున్నాయి. లక్షలాది కోళ్ల మృతికి కారణం బర్డ్‌ప్లూ కారణమని ప్రభుత్వం ప్రకటిస్తే రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని, అందుకే ఆ వ్యాధిగా ప్రభుత్వం ప్రకటించ లేదని కొంతమంది పౌల్ట్రీ రైతులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. గడిచిన 20 రోజులుగా కోళ్లు మృతిచెందినా అధికారులు పట్టించుకోక ప్రస్తుతం కొత్తరకం రాణికట్ ఆనే వ్యాధిని తెరపైకి తెచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. పక్క రాష్ట్రమైన ఒడిశా రాష్ట్రంలో ప్రస్తుతం బర్డ్‌ప్లూ వ్యాధి ఉందని ఆ వైరసే మన పౌల్ట్రీలకు సోకిందని రైతులు వాపోతున్నారు. మరోపక్క కోళ్ల మృతులు ఆగక పోవడంతో పదుల సంఖ్యలో పౌల్ట్రీలు ఖాళీ అవుతున్నాయి. రైతుల ఆరోపణపై ఎ.డి కన్నంనాయుడిని వివరణ కోరగా లేబొరేటరీలో పరీక్షల అనంతరం రాణికట్ వ్యాధిగా నిర్ధారణ అయిందన్నారు. రైతుల ఆరోపణలో వాస్తవం లేదన్నారు. వైరస్ తగ్గు ముఖం పట్టిన వెంటనే వ్యాక్సిన్ వేస్తామన్నారు.

రాణికట్ వ్యాధితోనే లక్షలాది కోళ్ల మృతి