
నిబంధనలు అతిక్రమిస్తే కేసులు
విజయనగరం క్రైమ్: రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ద్విచక్ర వాహనదారులపై చర్యలు చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందల్ శనివారం అన్నారు. నిబంధనలు అతిక్రమించిన ద్విచక్ర వాహన దారులపై 955 కేసులు నమోదు చేసి, రూ.4,77,460/లను జరిమానా విధించామన్నారు. బ్లాక్ స్పాట్స్ వద్ద వాహన తనిఖీలు చేపట్టి ద్విచక్ర వాహనాలను ప్రమాదకరంగా నడిపిన వాహనదారులపై 88 కేసులు నమోదు చేశామని తెలిపారు. హెల్మెట్స్ ధరించని వారిపై 155 కేసులు, మైనర్లు డ్రైవ్ చేస్తున్న వారిపై 8 కేసులు, లైసెన్స్ లేని వాహన చోదలకుపై 471 కేసులు నమోదు చేశామని చెప్పారు. ఇక భద్రత నియమాలు ఉల్లంఘించిన వారిపై 46 కేసులు, నంబర్ ప్లేట్స్ సక్రమంగా లేని వారిపై187 కేసులు నమోదు చేశామన్నారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని బ్లాక్ స్పాట్స్ వద్ద వాహన తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు రోడ్ సేఫ్టీ నిబంధనల గురించి, హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం వల్ల జరిగే అనర్థాలను వివరించి, కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. వాహనదారుతో పాటు బైక్ వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. ప్రతి వాహనదారు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, సురక్షితంగా గమ్య స్థానాలు చేరుకోవాలని హితవు పలికారు. ప్రత్యేక డ్రైవ్‌ను విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి డీఎస్పీ జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు పర్యవేక్షించారన్నారు.
ఎస్పీ వకుల్ జిందల్