
ఎరువు కరువు
ఆరుగాలం శ్రమించి అందరికీ అన్నంపెట్టే రైతన్న ఎరువు కోసం అగచాట్లుపడుతున్నాడు. పొలంపని మానుకుని పస్తులతో ఆర్‌ఎస్‌కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద పడిగాపులు కాస్తున్నాడు. అప్పటికీ ఎరువు దొరకక ఆవేదన చెందుతున్నాడు. ఏపిక లేని చేనును చూసి కన్నీరు పెడుతున్నాడు. ఆర్‌ఎస్‌కేలకు వచ్చిన అరకొర ఎరువును ‘అధికార’బలంతో కళ్లముందే తన్నుకుపోతుండడాన్ని చూసి నిశ్చేష్టుడవుతున్నాడు. ఇలాంటి దుస్థితిని ఎన్నడూ చూడలేదని, రైతన్నను ఉసురుపెట్టిన ఏ ప్రభుత్వమూ మనుగడసాగించలేదంటూ చీవాట్లు పెడుతున్నాడు.
యూరియా కావాలంటే క్యూ కట్టాల్సిందే...
గరివిడి మండలంలోని వెదుళ్లవలస గ్రామంలో రైతులు ఒక యూరియా బస్తా కోసం గంటల తరబడి సచివాలయం వద్ద క్యూ కట్టారు. 500 మంది రైతులు ఎరువుకోసం రాగా పోలీసుల సమక్షంలో రైతుకు బస్తా చొప్పున కేవలం 260 బస్తాలే శుక్రవారం పంపిణీ చేశారు. మిగిలిన వారికి ఆ ఒక్క బస్తా ఎరువు
లభించకపోవడంతో నిరాశతో
వెనుదిరిగారు.
– చీపురుపల్లిరూరల్(గరివిడి)
గనివాడ ఆర్‌ఎస్‌కే వద్ద యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు
లక్కవరపుకోట: మండలంలోని గనివాడ రైతు సేవా కేంద్రానికి వచ్చిన యూరియాను తలుపులు మూసివేసి కూటమి నాయకులు పంచుకున్నారు. దీనిపై రైతులు ప్రశ్నించారు. ఇక్కడి ఆర్‌ఎస్‌కేకు 200 బస్తాల యూరియా వచ్చింది. గనివాడ, మల్లివీడు, గేదలవానిపాలెం, కొత్తపాలెం, వేచలపువానిపాలెం, నిడుగట్టు గ్రామాలకు చెందిన రైతులకు ఇస్తామని వ్యవసాయాధికారులు తెలిపారు. దీంతో ఆయా గ్రామాల రైతులు గనివాడ ఆర్‌ఎస్‌కే వద్ద శుక్రవారం గంటల తబడి క్యూకట్టారు. చివరికి ఓ వర్గానికి చెందిన కూటమి నాయకులు ఎరువులను తమకు నచ్చినవారికి పంచేయడంతో వ్యవసాయాధికారులు ఏం చేయాలో తెలియక బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయారు. రైతులు నిరాశతో ఇంటిబాటపట్టారు.
గొల్లలపేట ఆర్‌ఎస్‌కే వద్ద ఎరువు కోసం స్లిప్పులు రాయిస్తున్న రైతులు
రామభద్రపురం: ఎరువుల కొరత రోజురోజుకీ తీవ్రమవుతోంది. పంటకు అవసరమైన సమయంలో యూరియా దొరకక రైతులు నానా కష్టాలు పడుతున్నారు. రామభద్రపురం మండలంలోని గొల్లలపేట ఆర్‌ఎస్‌కేకు 250 యూరియా బస్తాలు రాగా వాటి కోసం తెల్లవారి నుంచే రైతులు పడిగాపులు కాశారు. కొందరికి ఒక బస్తా యూరియా కూడా దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.

ఎరువు కరువు

ఎరువు కరువు