
ఏఐటీ టెస్ట్‌లో ఐటీఐ విద్యార్థుల ప్రతిభ
● జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన ఎర్ల సాయి
● ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్‌లో 600/600
విజయనగరం అర్బన్: ఆల్ ఇండియన్ ట్రేడ్ టెస్ట్–2025 ఫలితాల్లో విజయనగరం ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులు ప్రతిభ చూపారు. సీనియర్ ఎలక్ట్రీషియన్ విభాగానికి చెందిన ఎర్ల సాయి 600/600 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించారు. అదే విభాగంలో ఓ.శ్రీరాంసందీప్ 598/600, ఎల్.రఘునాథ్ 597/600, వై.ప్రణీత్ 596/600, డి.జయకిరణ్ 594/600, సాయి చైతన్య 590/600 మార్కులు లభించాయి. జూనియర్ ఎలక్ట్రీషియన్ విభాగంలో జెవీడీ చక్రధర్ 598/600, ఎస్.వరప్రసాద్ 591/600 మార్కులు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా ఐటీఐ ప్రిన్సిపాల్ టి.వి.గిరి మాట్లాడుతూ ఏఐటీ ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ చూపడం ఆనందంగా ఉందన్నారు. ఇన్‌స్ట్రక్టర్ శ్రీధర్ కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధించగలిగారని తెలిపారు. విద్యార్థులను కళాశాల బోధన సిబ్బంది అభినందించారు.
భక్తిశ్రద్ధలతో ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు
విజయనగరం టౌన్: మహ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ఈద్ మిలాద్ ఉన్ నబీ పండగను ముస్లిం సోదరులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వేకువజామునుంచి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీరత్ కమిటీ ఆధ్వర్యంలో నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ శాంతికి, దేశాభివృద్ధికి, సుస్థిరతకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. అంబటి సత్రం కూడలి నుంచి కోట, బాలాజీ కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, మయూరీ జంక్షన్, రైల్వేస్టేషన్ రోడ్డు, వైఎస్సార్ సర్కిల్, ఎన్‌సీఎస్ కూడలి, కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం మీదుగా ర్యాలీ సాగింది.
ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో ఏనుగుల గుంపు
కొమరాడ: మండలంలోని బంజకుప్ప గుమడ, కోటిపాం, కళ్లికోట, దుగ్గి తదితర ప్రాంతాల్లో ఇటీవల సంచరించిన తొమ్మిది ఏనుగుల గుంపు శుక్రవారం ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలైన కంచరపాడు, చీకటిలోవ, తదితర ప్రాంతాల్లో సంచరించాయి. కోనవలస, లక్ష్మీపేట, రాజ్యలక్ష్మీపురం గ్రామాలకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. గజరాజుల గుంపు తరలించేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

ఏఐటీ టెస్ట్‌లో ఐటీఐ విద్యార్థుల ప్రతిభ

ఏఐటీ టెస్ట్‌లో ఐటీఐ విద్యార్థుల ప్రతిభ