
ఆర్టీసీ బస్సుల అడ్డగింత
● ఆందోళనకు దిగిన ఆటో కార్మికులు
● యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా
● నెలకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్
బొబ్బిలి: ఆటో కార్మికుల ఉసురు తీయవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శంకరరావు, ఆటో కార్మికుల యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బస్సులను అడ్డగించి నిరసన చేశారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ వద్ద నిరసన ప్రదర్శన చేపడుతున్నప్పుడు ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సులు అటు వైపు వెళ్లడంతో కార్మికులు అడ్డుకున్నారు. డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పొట్నూరు శంకరరావు, ఆటో కార్మికుల సంఘం నాయకులు ఎ.మోహనరావు, బీటీఆర్ గంగరాజు, వీరన్న, జయరాం తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్తచట్టాలతో భారీ జరిమానాలు విధిస్తోందన్నారు. బీఎన్‌ఎస్ 106లోని పలు సెక్షన్ల ప్రకారం ఆటోలను నడపడమే కష్టతరంగా మారిందని వాపోయారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం పుండుపై కారం జల్లినట్టు ఫ్రీ బస్సు ప్రవేశపెట్టిందని, దీంతో మహిళలెవరూ ఆటోలు ఎక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
వేదాంతకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలి
అంతే కాకుండా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్న రాష్ట్రం దానిని అసలు పట్టించుకోకుండా వేదాంత సంస్థకు ఫిట్‌నెస్, బ్రేక్ సర్టిఫికెట్ల జారీ బాధ్యతను అప్పగించడం వల్ల ఆటో కార్మికులంతా అదనపు భారాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ పట్టణమంతా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా కార్మికులంతా పెద్ద పెట్టున నినదించారు. తమ సమస్యలను పరిష్కరిస్తామన్న చంద్రబాబు,పవన్ కల్యాణ్‌లు పత్తాలేకుండా పోయారన్నారు. వేదాంత సంస్థకు ఇచ్చిన బ్రేక్, ఫిట్‌నెస్ అనుమతులను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపును ప్రభుత్వమే భరించాలని, వెంటనే ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 17న జిల్లా బంద్ చేపడతామని హెచ్చరించారు. అప్పటికీ పట్టించుకోకపోతే ఈనెల 19న చలో విజయవాడ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం తహసీల్దార్ ఎం శ్రీనుకు మెమొరాండం అందజేశారు. కార్యక్రమంలో ఆటో కార్మికుల సంఘం నాయకులు త్రినాథ, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీఐ కె.సతీష్‌కుమార్, ఎస్సై పి జ్ఙానప్రసాద్, సిబ్బంది ఆటో కార్మికులు బస్సులకు ఆటంకం కలిగించకుండా చర్యలు తీసుకున్నారు.

ఆర్టీసీ బస్సుల అడ్డగింత