చదువుకున్న చోటే బోధన | - | Sakshi
Sakshi News home page

చదువుకున్న చోటే బోధన

Sep 5 2025 4:56 AM | Updated on Sep 5 2025 4:58 AM

చదువుకున్న చోటే బోధన

పార్వతీపురం రూరల్‌: విద్యార్థి జీవితంలో కళాశాల జ్ఞాపకాల నిలయం. ఇక్కడ నేర్చుకున్న పాఠాలు, అనుభవాలు జీవితాంతం మార్గనిర్దేశం చేస్తాయి. ఆ విద్యార్థుల్లో కొందరు మాత్రమే ప్రతిభ, కృషి నిబద్ధతతో భవిష్యత్‌లో గురువులుగా మారుతారు. విద్యార్థిగా తరగతి గదిలో కూర్చుని గురువు వెలిగించిన జ్ఞానదీపంతో మంచి మార్గంలో నడుస్తూ గతంలో కళాశాల తరగతి గదుల్లో పాఠాలు నేర్చుకున్న వారే అదే తరగతి గదుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తూ అధ్యాపకులుగా, కళాశాల ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తూ పలువురికి ఆదర్శనమవుతున్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్‌కళాశాలలో ప్రస్తుతం ప్రిన్సిపాల్‌గా, ఎకనామిక్స్‌ అధ్యాపకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారు గతంలో ఇదే కళాశాలలో ఇంటర్‌మీడియట్‌ పూర్తిచేశారు. ప్రస్తుతం వారు చదువుకున్న చోటే ప్రిన్సిపాల్‌గా ఒకరు, అధ్యాపకుడిగా మరొకరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వారు చదువుకున్న ఆనాటి జ్ఞాపకాలను వారి మాటల్లో తెలుసుకుందాం.

నాడు విద్యార్థిగా నేడు ప్రిన్సిపాల్‌గా

మా స్వగ్రామం సీతానగరం మండలం మరిపివలస కావడంతో రోజూ ఉదయం 8గంటలకు కళాశాలకు సైకిల్‌పై స్నేహితులతో కలిసి చేరుకునేవాళ్లం. సాయంత్రం 6గంటల వరకు కళాశాలలోనే ఉండే వారం. నాకు తక్కువ మార్కులు వచ్చిన కారణంగా ఎంపీసీలో సీటు ఆశించినప్పటికీ బైపీసీలో సీటు దక్కింది. ఈ కళాశాలలో విద్యార్థిగా జీవితానికి ఉపయోగపడే చాలా పాఠాలు నేర్చుకున్నాను. ఊహించని రీతిలో ఇదే కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తానని అనుకోలేదు. 1990లో ఈ కళాశాలలో ఇంటర్‌మీడియట్‌ పూర్తిచేశాను. అనంతరం 2003లో బోటనీ అధ్యాపకుడిగా కళాశాలకు వచ్చి నేడు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహించడం, చదువుకున్న చోటే ఉద్యోగం చేయడం ఆసక్తిగా ఉంది. – ఆకుల రాజు, ప్రిన్సిపాల్‌,

పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

6 నుంచి ఇంటర్‌ వరకు

మా నాన్నగారు ఇదే కళాశాలలో వ్యాయామ అధ్యాపకుడిగా పనిచేసేవారు. ఈ క్రమంలో 1978 నుంచి 1985 వరకు 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఇదే కళాశాలలో చదువుకున్నాను. అయితే ఇదే కళాశాలలో ప్రస్తుతం ఎకనామిక్స్‌ అధ్యాపకుడిగా పనిచేసే అవకాశం కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒకప్పుడు నేను కూర్చుని విద్యాబుద్ధులు నేర్చుకున్న చోటే అధ్యాపకుడిగా బోధన చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు.

–టి.రవికుమార్‌, గుమ్మలక్ష్మీపురం

చదువుకున్న చోటే బోధన1
1/1

చదువుకున్న చోటే బోధన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement