
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
లక్కవరపుకోట: మండలంలోని అరకు–విశాఖ జాతీయ రహదారిలో రంగరాయపురం జంక్షన్ సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేపాడ మండలం చామలాపల్లి గ్రామానికి చెందిన పెద్దాడ అర్జునరావు మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భార్య, కుమారుడితో కలిసి విశాఖ జిల్లా చిన్న ముషిడివాడలో అర్జునరావు నివాసముంటున్నాడు. తమ స్వగ్రామంలో వినాయక నిమజ్జన మహోత్సవానికి బైక్‌పై వెళ్తుండగా రంగరాయపురం జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టిన అర్జునరావు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌పడాల్ తెలిపారు.
బొలెరో ఢీకొని యువకుడు..
బొండపల్లి: మండలం కేంద్రంలోని పెట్రోల్ బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. గురువారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన కు సంబంధించి ఎస్సై యు. మహేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం నుంచి మక్కువకు ముగ్గురు యువకులు బైక్‌పై వెళ్తుండగా పెట్రోల్ బంక్ వద్ద ఎదురురుగా వస్తున్న బస్సును తప్పించే క్రమంలో బోలెరోను బలంగా ఢీ కొట్టడంతో ప్రమాదంలో బైక్‌పై కూర్చున్న దాసరి సాయి(20)తీవ్రంగా గాయపడి విజయనగరంలోని కేంద్ర సర్వ జన ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఆవాల రాజేష్ బైక్ నడుపుతూండగా, వెనుక ఎన్.రఘు ఉన్నాడు. గాయపడిన వారిద్దరినీ చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తునట్లు ఎస్సై తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి