
కోళ్ల మరణాలను ఆపేందుకు సస్యరక్షణ చర్యలే మార్గం..
● పశువర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్
దామోదరరావు
కొత్తవలస: కొత్తవలస సబ్‌డివిజన్ పరిధిలో కొత్తవలస, లక్కవరపుకోట మండలాలతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఇటీవల లక్షకుపైగా పౌల్ట్రీ, నాటుకోళ్లు మృత్యవాత పడుతున్నాయని ఈ మరణాలను అరికట్టేందుకు సస్యరక్షణ చర్యలు చేపట్టడం ఒక్కటే మార్గమని పశువర్ధకశాఖ డిప్యూటీ డైరెక్టర్ కె.దామోదరరావు అన్నారు. ఈ మేరకు కొత్తవలస, లక్కవరపుకోట మండలాల్లో వింత వ్యాధితో లక్షకుపైగా కోళ్ల మృతి శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా కొత్తవలస ఎ.డి కార్యాలయంలో రెండు మండలాల పశువైద్యాధికారులు, సచివాలయం పశుసహాయకులతో సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. చనిపోయిన కోళ్ల నమూనాలను పరీక్ష నిమిత్తం విజయవాడ సెంట్రల్ లేబొరేటరీకి పంపించామని వ్యాధి నిర్థారణ నివేదికలు రాలేదని డీడీ తెలిపారు. ఈ సందర్భంగా డీడీ దామోదరరావు మాట్లాడుతూ లక్షకు పైగా కోళ్లు మృతి చెందడం వాస్తవమేనన్నారు. పౌల్ట్రీల్లో మరో రెండు నెలల వరకు కొత్త పిల్లలను పెంచవద్దని చూచించారు. గ్రామాల్లో ఎటువంటి పక్షులు చనిపోయినా గ్రామానికి దూరంగా గొయ్యి తీసి పాతిపెట్టాలని చెప్పారు. పౌల్ట్రీల్లో పనిచేసే కార్మికులు మిగిలిన కోళ్లకు వైరస్ సోకకుండా ఉండేందుకు శానిటైజేషన్ చేయాలన్నారు. ఈ జాగ్రత్తలపై గ్రామాల్లో దండోరా వేసి అవగాహన కల్పించాలని సిబ్బందికి చూచించారు. కార్యక్రమంలో ఎ.డి కన్నంనాయుడు, రెండు మండలాల పశువైద్యాదికారులు పాల్గొన్నారు.

కోళ్ల మరణాలను ఆపేందుకు సస్యరక్షణ చర్యలే మార్గం..