
ఆటో, మ్యాక్సీ క్యాబ్ కార్మికులను ఆదుకోవాలి
● 17న బంద్‌లో కార్మికులంతా పాల్గొనాలి
● ఏఐటీయూసీ, ఏఐఎఫ్‌టీయూ(న్యూ) సీఐటీయూ పిలుపు
విజయనగరం గంటస్తంభం: ఆటో మ్యాక్సీ క్యాబ్ రంగ కార్మికులను ఆదుకోవాలని, ఈనెల17న జరిగే బంద్ కార్యక్రమంలో కార్మికులంతా పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ మోటార్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రమణమూర్తి ఏఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పాండా సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.సురేష్ కోరారు. ఈ మేరకు బుధవారం స్థానిక అమర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు కారణంగా రోడ్డున పడ్డ ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వెంటనే ప్రత్యామ్నాయంగా రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక పరిశ్రమలు మూత పడ్డాయని. అందులో ఆటో మ్యాక్సీ క్యాబ్‌లపై జీవనం సాగించే కార్మికులు ఉన్నారన్నారు. నిరంతరం ఈ కార్మికులపై ఆర్టీఏ, పోలీస్ అధికారులు జరిమానాలు వేస్తూనే ఉన్నారన్నారు. తమకు ఓటు వేస్తే వాహనం మిత్రుల కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు సరిగదా. ఫ్రీ బస్సు పథకాన్ని తీసుకువచ్చి వారందరినీ రోడ్డున పడేసిన పరిస్థితికి తీసుకు వచ్చిందని ఆందోళన వెలిబుచ్చారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేకమంది ఆటో మ్యాక్సీ క్యాబ్ కార్మికులు పస్తులు ఉండడమే కాక మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆటో టాటా మ్యాజిక్ కార్మికులను ఆదుకోవాలని లేకుంటే రానున్న స్థానిక ఎన్నికలలో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రంగరాజు,పి.ఈశ్వరరావు బి.చిన్నారావు ఏఐఎఫ్‌టీయూ నాయకులు ఎన్.అప్పల రెడ్డి,రెడ్డి నారాయణరావు జి.నారాయణరావు, సీఐటీయూ నాయకులు ఎ.జగన్, బి.తిరుపతి,జె.అప్పారావు, జి.కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.