
జిల్లా ఆస్పత్రిలో బ్రెయిన్ హెల్త్ క్లినిక్ ప్రారంభం
పార్వతీపురంటౌన్: పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో బ్రెయిన్ హెల్త్ క్లినిక్‌ను కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర బుధవారం ప్రారంభించారు. నీతి ఆయోగ్ ప్రాజెక్ట్ బృందం డిల్లీ నుంచి వర్చువల్‌గా బ్రెయిన్ హెల్త్ క్లినిక్ కార్యక్రమాన్ని ప్రసారం చేసి కార్యాచరణ అంశాలపై వివరించింది. జిల్లా ఆస్పత్రి నుంచి కలెక్టర్, ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ అధికారులు ఆన్‌లైన్ ప్రెజెంటేషన్‌ను వీక్షించారు. బ్రెయిన్ హెల్త్ క్లినిక్‌లో అందుబాటులోకి రానున్న సేవలపై జిల్లా ఆస్పత్రి వైద్యబృందంతో వారు చర్చించారు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక జీవన ప్రపంచంలో మానవుని జీవనశైలి విధానాలు క్రమేణా పలు మానసిక రుగ్మతలు, ఒత్తిడులకు దారి తీస్తున్న నేపధ్యంలో బ్రెయిన్ హెల్త్ పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉందని, నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యల్లో మైగ్రేన్(పార్శ్వ బాధ) కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని, అలాగే ఎపిలిప్సీ (ఫిట్స్), ఆటిజం, డిప్రెషన్ కు లోనవ్వడం మొదలగు మానసిక సమస్యలు రోజు రోజుకీ పెరుగుతున్న నేపధ్యంలో బ్రెయిన్ హెల్త్ క్లినిక్ సేవలు అందుబాటులోకి రావడం శుభ పరిణామమన్నారు. మన జిల్లాకు బ్రెయిన్ హెల్త్ క్లినిక్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నందున జిల్లా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎస్.భాస్కరరావు, డీసీహెచ్‌ఎస్ డా.నాగభూషణరావు, ఎన్సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి డా. జగన్మోహనరావు, సూపరిండెంటెంట్ డా.నాగశివజ్యోతి, సైకియాట్రిస్ట్ డా.రష్మిత, వైద్యాధికారులు డా శ్యామల, డా.కౌశిక్, ప్రజాప్రతినిధులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.