
రైతాంగ సమస్యలపై.. పోరుబాట
–8లో
మహిళా సంక్షేమంపై మరుపు
మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మర్చిపోయింది.
విజయనగరం:
ఆరుగాలం శ్రమించి పదిమందికీ పట్టెడన్నంపెట్టే రైతాంగ సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ మరోమారు పోరుకు సిద్ధమవుతున్నట్టు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని ధర్మపురిలో గల సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవసాయం సంక్షేభంలో కూరుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభ సమయంలోనే యూరియా, డీఏపీ ఎరువులు సరఫరా చేయాలని జిల్లా యంత్రాంగానికి వినతిపత్రాలు అందజేసినా ప్రయోజనం లేకపోయిందన్నారు. తక్షణమే ఎరువు కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న జిల్లాలోని రెవెన్యూ డివిజన్ కార్యాలయ వద్ద నిరసనలు చేపట్టి వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమానికి మద్దతు తెలిపే రైతులతో పాటు రైతు సంఘాలు, రైతు సమస్యలపై స్పందించే పార్టీలను కలుపుకుంటామని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ రోజు జరిగే కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి పోరుబాటను విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.
● అడుగడుగునా అన్యాయమే...
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతాంగానికి అడుగడుగునా అన్యాయం జరుగుతోందని మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. గడిచిన 15 నెలల్లో కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఇస్తామన్న అన్నదాత సుఖీభవ మొదటి ఏడాది అందలేదని, ఈ ఏడాది కూడా రూ.5వేలు చొప్పున రైతులు ఖాతాల్లో వేసి చేతులు దులుపుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల మందిని అనర్హులుగా ప్రకటించి పథకానికి దూరం చేయగా.. విజయనగరం జిల్లాలో సుమారు 20వేల మందికి అన్యాయం చేశారన్నారు. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునే పంటల బీమా పథకాన్ని ఎత్తివేశారన్నారు. చెరకు, మొక్కజొన్న పంటలకు మద్దతు ధర కరువైందన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యలు సరికాదు
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. ఎరువుల కోసం గంటల తరబడి రైతులు క్యూలలో వేచి ఉండే ఫొటోలను ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురిస్తే.. వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. సాక్షి దినపత్రికలోనే కాకుండా మిగిలిన అన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు మంత్రికి కనబడలేదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులు కప్పిపుచ్చుకునేందుకు రైతులను చులకన చేసి మాట్లాడడం సరికాదన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, అల్లాడ సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు పతివాడ సత్యనారాయణ పాల్గొన్నారు.
దీనస్థితిలో రైతాంగం
మూడు ప్రాంతాల్లో నిరసనలు
ఈ నెల 9న రెవెన్యూ డివిజన్
కార్యాలయాల వద్ద నిరసనలు
ప్రభుత్వం నిర్లక్ష్యంతో సంక్షోభంలో వ్యవసాయం
సరిపడా ఎరువుల అందించడంలో ఘోర వైఫల్యం
12,700 మెట్రిక్ టన్నులకు జిల్లాకు చేరింది 6,990 మెట్రిక్ టన్నులే..
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
అచ్చెన్నాయుడు వాఖ్యలపై మండిపాటు
ఆన్నదాత సుఖీభవ పథకంలో రైతన్నకు అన్యాయం
జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా
అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద రైతులతో కలిసి నిరసనలుచేపట్టి అధికార యంత్రాంగానికి వినతులు ఇస్తామని మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.. విజయనగరం ఆర్డీఓ కార్యాలయం వద్ద విజయనగరం, నెల్లిమర్ల, ఎస్.కోట నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలోను, చీపురుపల్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద చీపురుపల్లి, రాజాం నియోజకవర్గాల సమన్వయకర్తల ఆధ్వర్యంలోను, బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయం వద్ద బొబ్బిలి, గజపతినగరం నియోజకవర్గం సమన్వయకర్తల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కార్యక్రమం నిర్వహణపై ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు నియోజకవర్గ, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతాంగం పరిస్థితి దిగజారిపోయిందని జెడ్పీ చైర్మన్ పేర్కొన్నారు. రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడంలేదని వాపోయారు. ఏటా మార్క్‌ఫెడ్ ద్వారా 50 శాతం, ప్రైవేటు డీలర్ల ద్వారా 50 శాతం ఎరువుల విక్రయాలు జరిగేవన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆగస్టు చివరి నాటికి మార్క్‌ఫెడ్ ద్వారా 12,700 మెట్రిక్ టన్నుల ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందిస్తే, ప్రస్తుత ఏడాదిలో 6,990 మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే వచ్చాయన్నారు. రూ.280కు విక్రయించాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్‌లో రూ.500నుంచి రూ.600 ధర పెంచి విక్రయిస్తున్నారు. అధికార యంత్రాంగం విజిలెన్స్ దాడులు చేసి కేసులు పెడుతున్నా, రైతాంగం సమస్యలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్లు లేదన్నారు.