
ఆత్మహత్యే శరణ్యం
● విధుల నుంచి తొలగించవద్దంటూ షిఫ్ట్ ఆపరేటర్ల ఆందోళన
● వెదుళ్లవలస సబ్‌స్టేషన్ వద్ద ధర్నా
చీపురుపల్లి రూరల్ (గరివిడి): తమను అక్రమంగా తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమంటూ గరివిడి మండలం వెదుళ్లవలస సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న షిఫ్ట్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సబ్‌స్టేషన్ వద్ద బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు ఆపరేటర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నియామకమైన తమను తొలగించి వేరొకరిని నియమించేందుకు పాలకులు, అధికారులు ప్రయత్నించడం తగదన్నారు. తమ కుటుంబాలు రోడ్డున పడతాయన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. 18 నెలలుగా జీతాలు లేకుండానే పనిచేస్తున్నామన్నారు. ఇప్పుడు కొత్తగా మా స్థానంలో ఏపీఈపీడీసీఎల్ అధికారులు ఇచ్చిన నియామక పత్రాలు పట్టుకుని ఇద్దరు వచ్చారని, ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఉన్నఫళంగా విధుల నుంచి తొలగిస్తే చావుతప్ప మరో దారిలేదన్నారు. ఎస్‌ఐ లోకేశ్వరావు షిఫ్ట్ ఆపరేటర్లతో మాట్లాడి ఆందోళనను సద్దుమణిగించారు.