
డ్రోన్ల సహాయంతో పోలీసుల దాడులు
విజయనగరం క్రైమ్: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై పోలీసులు డ్రోన్ల సహాయంతో కొరఢా ఝళిపిస్తున్నారు. జిల్లాలోని జామి పోలీస్‌స్టేషన్ పరిధి భీమసింగి, పెదమానాపురం పోలీస్‌స్టేషన్ పరిధి మానాపురం సంత శివారు ప్రాంతాల్లో శనివారం ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వారిపై డ్రోన్ల సహాయంతో శనివారం దాడులు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై ఆకస్మికంగా డ్రోన్ల సాయంతో దాడులు చేస్తున్నారు. ఇలా మద్యం సేవిస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. పెదమానాపురం సంత వద్ద కూడా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారిపై మూడు కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.