
నలుగురు ఉపాధ్యాయులకు మెమో
మక్కువ: మండలంలోని మార్కొండపుట్టి మోడల్ ప్రైమరీ పాఠశాలకు చెందిన నలుగురు ఉపాధ్యాయులుకు మెమో జారీచేసినట్లు ఎంఈవో శ్యామ్‌సుందర్ శుక్రవారం తెలిపారు. సాక్షిలో శుక్రవారం ‘పాపం చిన్నారులు..!’ అనే కథనం ప్రచురితమైంది. పేరెంట్స్, టీచర్స్ సమావేశం మాత్రమే నిర్వహించాలి తప్ప, ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టరాదని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, అందుకు విరుద్ధంగా ఉపాధ్యాయులు పాఠశాల ఎదుట నడిరోడ్డుపై సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటానికి క్షీరాభీషేకం నిర్వహించడంతోపాటు, రోడ్డుపై చిన్నారులను, తల్లిదండ్రులును కూర్చోబెట్టి పాదపూజ నిర్వహించడం సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొట్టడంతో పలు పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దీంతో డీఈవో రాజ్‌కుమార్ స్పందించి, నలుగురు ఉపాధ్యాయులకు మెమో ఇవ్వాలని ఎంఈవో శ్యామ్‌సుందర్‌కు ఆదేశాలు ఇవ్వడంతో, శుక్రవారం ఆ ఉపాధ్యాయులుకు మెమో ఇచ్చామని, ఉపాధ్యాయుల నుంచి వివరణ రావాల్సి ఉందని ఎంఈవో శ్యామ్‌సుందర్ తెలిపారు.
కానిస్టేబుల్ అభ్యర్థి అదృశ్యం
విజయనగరం క్రైమ్: పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షలో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెందిన ఓ అభ్యర్థి అదృశ్యమయ్యాడు. నగరానికి చెందిన పల్లి పైడి నాయుడు(25) ఇటీవల పలు పోటీ పరీక్షలకు సమాయత్తం అయ్యాడు. అలాగే పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు కూడా హాజరై రాత పరీక్ష రాశాడు. అయితే రెండు రోజుల క్రితం వచ్చిన కానిస్టేబుల్ పరీక్షా ఫలితాల్లో పైడినాయుడు ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపం చెంది కన్నవారికి తాను ఇక భారం అనుకుని ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు పైడినాయుడి మామయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్ చెప్పారు.