
మధ్యవర్తిత్వం ప్రజలకు చేరువకావాలి
విజయనగరం లీగల్: మధ్యవర్తిత్వం ప్రజలకు మరింత చేరువకావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షులు ఎం.బబిత అన్నారు. మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందిన న్యాయవాదులకు గురువారం ఒక రోజు వర్క్‌షాప్, ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ మధ్యవర్తిత్వం చాలా సులువైనది, ఖర్చులేనిదన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం దేశవ్యాప్తంగా 90 రోజులు పాటు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. శిక్షణలో భాగంగా కేరళ రాష్ట్రం నుంచి ఇద్దరు మాస్టర్ ట్రైనీ మీడియేటర్స్ వచ్చి న్యాయవాదులందరికీ శిక్షణ అందిస్తున్నారన్నారు. ఈ స్టాల్ జిల్లా కోర్టు ఆవరణలో ఈ రోజు నుంచి పదిరోజుల పాటు ప్యానల్ లాయర్స్, పారాలీగల్ వలంటీర్స్ నిర్వహిస్తున్నారని, వారు ప్రజలకు మధ్యవర్తిత్వంపై అవగాహన కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కలిశెట్టి రవిబాబు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంది
● పేరెంట్స్ కమిటీ సమావేశంలో చైర్మన్ ఆవేదన
● ఎమ్మెల్యే ‘కళా’ సమక్షంలోనే
సమస్యలపై ఏకరువు
● ప్రసంగం ఆపేయాలని బ్రతిమలాడిన ఉపాధ్యాయులు
చీపురుపల్లి: మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉంది. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తరచూ విద్యార్థులు తల్లిదండ్రులే స్వయంగా వచ్చి చెబుతున్నారు. ఇదేదో తాను వ్యక్తిగతంగా చెబుతున్నది కాదు. తల్లిదండ్రులు అంతా చెబుతుండడంతోనే అందరి ఎదుట చెప్పాల్సి వస్తోంది. దయచేసి మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక శ్రద్ధతీసుకునేలా చర్యలు చేపట్టండి. కొంతమంది విద్యార్థులకు బ్యాగులు కూడా ఇవ్వలేదు. పాఠశాలలో మరుగుదొడ్లు లేవు. ఈ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే శ్రద్ధ చూపాలి. విద్యార్థులకు కష్టాలు దూరంచేసేలా చర్యలు తీసుకోవాలంటూ స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన మెగా పేరెంట్స్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ఎదుట సాక్షాత్తూ అదే పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ గవిడి సురేష్ ఏకరువు పెట్టారు. పాఠశాలలో సమస్యలు పరిష్కారమవుతాయనే ఎమ్మెల్యే ముందు చెప్పాల్సి వస్తోందని ఆయన చెబుతున్నప్పటికీ పాఠశాల హెచ్‌ఎంతో సహా కొంతమంది ఉపాధ్యాయులు ప్రసంగం ఆపేయమని పక్క నుంచి షర్టు లాగడం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే సందర్భంలో మధ్యాహ్న భోజనం బాగుందా లేదా తల్లిదండ్రులే చెప్పాలని సురేష్ మైక్‌లో ప్రశ్నించగా బాగాలేదని తల్లిదండ్రులు నుంచి సమాధానం రావడం ఉపాధ్యాయులకు మరింత ఇబ్బందికరంగా మారింది. కార్యక్రమంలో పౌరసరఫరాలశాఖ రాష్ట్ర డైరెక్టర్ గద్దే బాబూరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
దూసుకొచ్చిన మృత్యువు
రణస్థలం: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతా నుంచి ముంబయి వైపు పైపుల లోడుతో వెళ్తున్న ఐషర్ వ్యాన్ రణస్థలం వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి అవతల వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో విశాఖ వైపు నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న ధర్మల పరమేశ్వర రెడ్డి(34) అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవింగ్ చేస్తున్న కనకరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి స్వగ్రా మం రాజాం. మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ వృత్తిరీత్యా పాత్రునివలస, విశాఖపట్నంలో ఉంటున్నాడు. ఆయనకు భార్య ఇందు, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఘటనా స్థలాన్ని జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి పరిశీలించారు.

మధ్యవర్తిత్వం ప్రజలకు చేరువకావాలి

మధ్యవర్తిత్వం ప్రజలకు చేరువకావాలి