
ఆమె వెళ్లారు.. ఆయన వచ్చారు..!
పూసపాటిరేగ: ఇద్దరి రాజకీయనాయకుల మధ్య పంతం... విద్యార్థులనే కాదు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులకు పరీక్షపెట్టింది. ఒకరు వెళ్లాక మరొకరు రావడంతో రెండుసార్లు సమావేశాలు ఏర్పాటుచేసి వారిచ్చే ఉపన్యాసాలను వినాల్సివచ్చింది. ఈ వింత పరిస్థితి పూసపాటిరేగ ప్రభుత్వ జూనియర్ కళాశాల, సతివాడ మోడల్ స్కూల్‌లో గురువారం నిర్వహించిన పేరెంట్ టీచర్స్ మీటింగ్‌కు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఎదురైంది. ఉదయం 10.30 గంటలు సమయంలో ఎమ్మెల్యే లోకం నాగమధవి పూసపాటిరేగ ప్రభుత్వజూనియర్ కళాశాలకు వచ్చి విద్యార్థులు, వారి తల్లిదండ్రులనుద్దేశించి మాట్లాడారు. 11.30 గంటలకు వెళ్లిపోయారు. ఆమె వెళ్లిన 10 నిమిషాలకు అంటే 11.40 సమయంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మెన్ కర్రోతు బంగార్రాజు అదే కళాశాలకు వచ్చారు. మళ్లీ విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఆటల పోటీల్లో విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. నెల్లిమర్ల మండలం సతివాడ మోడల్ పాఠశాలలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఇద్దరి నేతల మధ్య ఆదిపత్యపోరులో కొన్నాళ్లుగా అధికారులు నలిగిపోతుండగా, ఇప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థులు, గురువుల వంతు వచ్చిందంటూ గుసగుసలాడారు.
పాలకుల పంతం తల్లిదండ్రులకు పరీక్ష
రెండుసార్లు సమావేశం నిర్వహణ
పూసపాటిరేగ ప్రభుత్వ జూనియర్
కళాశాల, సతివాడ మోడల్ స్కూల్‌లో విసిగి పోయిన తల్లిదండ్రులు

ఆమె వెళ్లారు.. ఆయన వచ్చారు..!