
28న మిస్టర్ ఆంధ్ర ఓపెన్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్
విజయనగరం: కళలకు కాణాచి, విద్యలనగరం, క్రీడలకు పుట్టినిల్లు విజయనగరంలో ఈనెల 28న మిస్టర్ ఆంధ్ర ఓపెన్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ నిర్వహించనున్నట్లు జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నిర్వాహకుడు కనకల కృష్ణ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పోటీల నిర్వహణకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కనకల ఎర్రయ్య మెమోరియల్ క్లాసిక్ క్లబ్ నేతృత్వంలో 8 కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి రూ.1.20 లక్షల మొత్తాన్ని నగదు ప్రోత్సాహకంగా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది నిర్వహించిన పోటీల్లో 184 మంది పాల్గొన్నారని, ఈ ఏడాది నిర్వహించే పోటీల్లో 200మందికి పైగా వాయ్యామ సాధకులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. నగరంలోని గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించే పోటీల్లో పాల్గొనే వారికి ఉచితంగా భోజన వసతిసదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అభినవ భీముడు కోడి రామమూర్తి, నాగమళ్ల పైడిరాజుల స్ఫూర్తితో నిర్వహించే కార్యక్రమంలో క్రీడాభిమానులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రతినిధులు కోరాడ శ్రీనివాసరావు, కోట్ల రమేష్, వంశీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.