కౌలు కార్డులు అందేనా..? | - | Sakshi
Sakshi News home page

కౌలు కార్డులు అందేనా..?

Jul 7 2025 5:59 AM | Updated on Jul 7 2025 5:59 AM

కౌలు

కౌలు కార్డులు అందేనా..?

కార్డుల పంపిణీ లక్ష్యం 16,250

ఇంతవరకు ఇచ్చింది 10,700

దరఖాస్తు చేసినా కార్డు రాకపోవడంతో ఎదురుచూపులు

కార్డు లేక విత్తనాలు, ఎరువులు

పొందలేకపోతున్న రైతులు

విజయనగరం ఫోర్ట్‌: ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు సిరపురపు రామునాయుడు. గంట్యాడ మండలం పెదవేమలి గ్రామానికి చెందిన ఈ రైతు విజయనగరం మండలం రాకోడు గ్రామంలో పొలం కౌలుకు చేస్తున్నాడు. కౌలు కార్డు కోసం 20 రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. ఇంతవరకు కౌలు కార్డు ఇవ్వలేదు. దీంతో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం రాయితీపై అందించే విత్తనాలు పొందలేక పోయాడు. ప్రైవేట్‌ విత్తన దుకాణంలో కొనుగోలు చేసుకున్నాడు.

ఈ రైతే కాదు. అనేక మంది భూమిని కౌలుకు చేసుకున్న రైతులు కౌలు కార్డులు అందక ఇబ్బంది పడుతున్నారు. కౌలురైతులందరికీ కార్డులు ఇస్తున్నామని కూటమి సర్కార్‌ గొప్పలు చెబుతోంది కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. కౌలు కార్డులు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైనప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో కౌలు కార్డులు రైతులకు ఇవ్వలేదు. కార్డులు లేక పోవడం వల్ల ప్రభుత్వం రాయితీపై ఇచ్చే విత్తనాలు, ఎరువులు పొందలేక పోయారు.

ఈ ఏడాది కౌలు కార్డుల లక్ష్యం16,250

భూమిని కౌలుకు చేసే రైతులను గుర్తించి వారికి కార్డులను ఇస్తారు. 2025–26 సంవత్సరానికి గాని 16,250 మందికి కౌలు కార్డులు ( సాగు హక్కు ధ్రువీకరణ పత్రాలు) అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇంతవరకు 10, 700 మందికి అందించారు. 5550 మందికి ఇంకా ఇవాల్సి ఉంది.

కార్డులు అందక నష్టపోతున్న రైతులు

కౌలు కార్డులు అందకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. భూమి ఉన్న రైతులు ప్రభుత్వం రాయితీపై అందించే విత్తనాలు, ఎరువులు వారి వన్‌వీ లేదా పట్టాదారు పాస్‌పుస్తకం పట్టుకుని వెళ్లి తెచ్చుకుంటారు. అదేవిధంగా పంటను కూడా విక్రయించుకుంటారు. భూమిని కౌలుకు చేసుకునే రైతులు కౌలు కార్డు పట్టుకుని విత్తనాలు, ఎరువులు తెచ్చుకుంటారు. అలాగే కౌలుకార్డు ద్వారా పండించిన పంటను కూడా విక్రయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కౌలు కార్డులు లేక పోవడం వల్ల చాలా మంది కౌలు రైతులు ఈ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు.

త్వరలో ఇచ్చేందుకు చర్యలు

2025–26 సంవత్సరానికి సంబంధించి 16,250 మంది కౌలురైతులకు కార్డులు ఇవ్వాల ని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 10,750 మందికి అందజేశాం. మిగిలిన వారికి కూడా త్వరలో ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.

వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి

కౌలు కార్డులు అందేనా..?1
1/1

కౌలు కార్డులు అందేనా..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement