
సచివాలయాల్లో అక్రమ బదిలీలు!
‘ఓ సచివాలయ అగ్రికల్చర్ సెక్రటరీకి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తను కోరుకున్న మెంటాడ మండలంలోని ఓ సచివాలయానికి బదిలీ చేస్తూ ఆదివారం రాత్రి తొలి బదిలీ జాబితా విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి రిలీవింగ్ తీసుకోవడం ఆలస్యం కావడంతో మంగళవారం వరకు బదిలీ స్థానంలో బాధ్యతలు స్వీకరించలేదు. ఇంతలోనే మంగళవారం మరో బదిలీ జాబితా వచ్చింది. ఇంకా జాయిన్ అవ్వని మెంటాడ మండలం నుంచి మరో మండలానికి బదిలీ అయినట్టు ఆదేశాలొచ్చాయి.’ ఇలా జిల్లాలోని 34 మందికి బదిలీ ఆదేశాలొచ్చాయి. వీరంతా బుధవారం కలెక్టరేట్‌కు చేరుకుని తమకు జరిగిన అన్యాయంపై ఆందోళన చేశారు. న్యాయం చేయాలని కోరారు. అనంతరం వ్యవసాయశాఖ జేడీ తారకరామారావుకు వినతి పత్రాన్ని అందజేశారు.
విజయనగరం అర్బన్: గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీల్లో నిబంధనలకు పాతరేస్తున్నారు. అధికార పార్టీ జోక్యం మితిమీరింది. ప్రజాప్రతినిధుల ఒత్తిడికి అధికారులు తలొగ్గుతూ అక్రమ, అకారణ బదిలీల్లో హద్దులు దాటారాని సచివాలయ ఉద్యోగులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకపోవడంపై అభ్యంతరం తెలుపుతున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ పరిధిలోని 330 మందికి ఇటీవల బదిలీ ప్రక్రియ చేపట్టారు. వీరిలో 34 మంది బదిలీలపై జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేల ఒత్తిడి పడింది. ఈ ఒత్తిడిని జిల్లా యంత్రాంగం తొలుత పట్టించుకోలేదు. మార్గదర్శకాల మేరకు అర్హులైన వారిని కోరుకున్న స్థానాలకు బదిలీ చేస్తూ తొలి బదిలీ జాబితాను ప్రకటించినట్టు చెబుతున్న అధికారులు, రెండో జాబితా అంటూ విడుదల చేసిన 34 మందికి స్థానచలనానికి స్పష్టత ఇవ్వడం లేదు.
అర్హతలేని వారికి బదిలీ ప్రాధాన్యం
నిబంధనల మేరకు కనీసం రెండేళ్లు సర్వీసు పూర్తికాని మెంటాడ మండలంలోకి ఒక డిజిటల్ అసిస్టెంట్‌కి రాజకీయ ఒత్తిడితో తను కోరుకున్న డెంకాడ మండలానికి అక్రమంగా బదిలీ చేశారు. విజయనగరం మండలం స్పౌజ్ అర్హత ఉన్న మరో డిజిటల్ సెక్రటరీని విజయనగరం మండలం, సమీప మండలానికి వేయకుండా దూర ప్రాంతానికి బదిలీచేస్తూ ఆదేశాలిచ్చారు’. ఇలా సచివాలయ సర్వే, సంక్షేమ, మహిళా పోలీస్ సిబ్బందికి బదిలీల్లో తీరని అన్యాయం జరిగింది. ప్రభుత్వ ఉత్వర్వుల ప్రకారం, రెండేళ్లు సేవాకాలాన్ని పూర్తిచేసిన ఉద్యోగులకే బదిలీ అవకాశం ఉండాలి. కొన్నిచోట్ల 1.5 ఏళ్లలోనే కొందరిని బదిలీ చేయడం, మరికొందరు 4 ఏళ్లుగా అదే చోట పనిచేస్తున్నా బదిలీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు, కొందరి ఆదేశాలతో సిఫారసుల ఆధారంగా బదిలీలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వినతులు పట్టించుకోని అధికారులు
ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ పోర్టల్ ద్వారా ఆప్‌లై చేసిన తర్వాత సిబ్బంది ఇచ్చిన అభ్యంతరాలను, కుటుంబ పరిస్థితులను, వైద్య సమస్యల ఆధారంగా ఇచ్చిన విజ్ఞప్తులను సంబంధిత శాఖ అధికారులు పెద్దగా పరిగణలోకి తీసుకోవలేదని బాధితులు చెబుతున్నారు. ‘తమ కుంటుంబ పరిస్థితులే కాదు పిల్లల చదువులు, సంరక్షణతోపాటు ఆరోగ్య సమస్యలను కూడా అధికారులు పట్టించుకోలేదని’ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు.
నిబంధనలకు పాతర
రెండురోజుల్లో రెండో బదిలీ జాబితా విడుదల
ఇంకా జాయిన్ అవ్వని స్థానం నుంచి బదిలీ ఆర్డర్లు
అర్హత లేని వారికి బదిలీలో ప్రాధాన్యం
ఆందోళనలో ఉద్యోగులు
మహళా పోలీసుల ఆందోళన
సచివాలయాల పరిధిలోని 600 మంది మహిళా సంరక్షణ పోలీసులకు బదిలీ ప్రక్రియలో స్థాన చలనం కలిగింది. వీరిలో 300 మంది వరకు మిగులు పోస్టులు కావడంతో డిప్యుటేషన్‌పై వేరొక శాఖకు పంపే ఆదేశాలిచ్చారు. మరోవైపు స్పౌజ్ అభ్యర్థులు 150 మంది వరకు ఉండడంతో మిగిలిన వారికి దూరప్రాంతాలకు బదిలీలు జరిగాయి. డిప్యుటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఏపీ విలేజ్ వార్డు సెక్రటేరియట్ మహిళా పోలీసు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా సంఘం ఆధ్వర్యంలో బుధవారం మహిళా పోలీసులు కలెక్టరేట్‌కు వచ్చి నిరసన చేపట్టారు. అనంతరం డీఆర్వోకు వినితిపత్రం అందజేశారు.