
వివాహేతర సంబంధంతోనే ఆత్మహత్య?
● మృతుడి భార్య ఫిర్యాదు
● కేసు నమోదు చేసిన పోలీసులు
కొత్తవలస: వివాహేతర సంబందం ఒక వ్యక్తి ఆత్మహత్యకు కారణమైంది. మండలంలోని కొత్తవలస మేజర్ పంచాయతీ పరిధి ఉమాదేవికాలనీకి చెందిన గంగవరపు గౌరీసత్యవరప్రసాద్ (38) ఆదివారం అప్పన్నదొరపాలెం పంచాయతీ తమ్మన్నమెరక సమీపంలో గల మామిడితోటలో చెట్టుకు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తన భర్త మరణానికి తమ్మన్నమెరక గ్రామానికి చెందిన ఒక మహిళ కారణమంటూ మృతుడి భార్య ఎర్నెమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ షణ్ముఖరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి సీఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
వివాహేతర సంబంధం ఉన్న మహిళ వేధింపులు
గంట్యాడ మండలం లక్కిడాం గ్రామం నుంచి సుమారు 20 సంవత్సరాల క్రితం ఉమాదేవికాలనీకి కుటుంబంతో వలస వచ్చి ఇటుకల బట్టీ వ్యాపారం చేసుకుంటూ గౌరీ సత్యవరప్రసాద్ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి ఽభార్య ఎర్నెమ్మ, కుమార్తె తోరణశ్రీ, కుమారుడు శ్యామ్‌సుందర్ ఉన్నారు. అదే ఇటుకల బట్టీలో పనిచేసే తమ్మన్నమెరక గ్రామానికి చెందిన మహిళతో సాన్నిహిత్యం గౌరీవరప్రసాద్‌కు ఉంది. దీంతో తన సంగతి తేల్ఛాలంటూ సదరు మహిళ తరచూ తన భర్తను బెదిరిస్తూ ఉండేదని మృతుడి భార్య ఎర్నెమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ తెలిపారు. ఆదివారం కూడా సదరు మహిళ తన భర్తకు ఫోన్ చేసి నిలదీయడంతో చెంతనే గల మామిడి తోటలో ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. గౌరీ సత్యవరప్రాద్ ఉరివేసుకున్న విషయాన్ని సదరు మహిళ మృతుడి తమ్ముడికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో మృతుడి భార్యతో పాలు కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి వెళ్లి చూసేసరికి అప్పటికే మృతిచెంది విగత జీవిగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఉరివేసుకుని మృతి చెందాడా? లేదంటే ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడిదీశారా ? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో విజయనరగం నుంచి ప్రత్యేక క్లూస్‌టీమ్, డాగ్‌స్కాడ్ వచ్చి ఘటనా స్థలంలో పరిశీలించారు. మృతుడి భార్య ఎర్నెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చుసి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్‌సీకి మృతదేహాన్ని తరలించారు.

వివాహేతర సంబంధంతోనే ఆత్మహత్య?