
గూడ్స్ కింద పడి వృద్ధుడి ఆత్మహత్య
కొత్తవలస: అనారోగ్య సమస్యల కారణంగా మనస్తాపం చెంది కొత్తవలస రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్‌కు ఎదురుగా వెళ్లి ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి గవర్నమెంట్ రైల్వే ఎస్సై బాలాజీరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా వేపగుంట సమీపంలోని సింహపురి కాలనీకి చెందిన చొప్ప సీతారామయ్య (78) తన కొడుకు వద్ద ఉంటున్నాడు. ఆయన భార్య నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందింది. దీంతో అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు వెంటాడడం మొదలయ్యాయి. ఆదివారం ఉదయం సింహపురి కాలనీ నుంచి బస్సులో కొత్తవసల వరకు వచ్చి జంక్షన్ నుంచి నేరుగా రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్లి ఎదురుగా వస్తున్న గూడ్స్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో స్టేషన్ మాస్టర్ ఇచ్చిన సమాచారం మేరకు జీఆర్‌పీ ఎస్సై సిబ్బందితో వచ్చి ఘటనా స్థలంలో పరిశీలించారు. మృతుడి చేతుల్లో సూసైడ్ నోట్ ఉండడాన్ని గమనించారు. అందులో తన చావుకు ఎవరూ కారణం కాదని, ఆరోగ్య సమస్యలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని విజయనగరం తరలించారు.

గూడ్స్ కింద పడి వృద్ధుడి ఆత్మహత్య