
బియ్యం దొంగలకు భరోసా..!
● వారి జోలికి వెళ్లొద్దని అధికారులకు కూటమి నేతల హుకుం
● అధికారులు మౌనం దాల్చారని విమర్శలు
విజయనగరం ఫోర్ట్: బొండపల్లి మండలంలో పెద్దఎత్తున పీడీఎస్ బియ్యం పట్టివేత సంఘటన జరిగి 24 రోజులవుతున్నా చర్యలు శూన్యం. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించిన దొంగలకు కూటమి నేతలు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టించిన వారి జోలికి వెళ్లొద్దని కూటమికి చెందిన నేతలు సంబంధిత శాఖ అధికారులకు హుకుం జారీ చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుచేతనే అధికారులు మిన్నకుండిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారం చేపట్టిన తొలినాళ్లలో కూటమి నేతలు ప్రగల్భాలు పలికారు. కానీ ఇప్పడు పీడీఎస్ బియ్యం నేరుగా నారసంచులతోనే దొరికినప్పటికీ కిమ్మనకపోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రేషన్ వాహనాల ద్వారా పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతోందనే డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేపట్టామని కూటమి సర్కార్ గొప్పలు చెప్పింది. రేషన్ డీలర్ల ద్వారా బియ్యం పంపిణీ చేపట్టిన మొదటి నెల ఆరంభంలోనే నార సంచులతో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించారు. ఇది పెద్ద ఎత్తున సంచలనమైంది.
బొండపల్లి మండలంలో పట్టుబడిన బియ్యం
పేదప్రజలకు అందించే పీడీఎస్ బియ్యం కొంతమంది వ్యాపారులు పెద్ద ఎత్తున పక్కదారి పట్టించారు. పీడీఎస్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో విజిలెన్స్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. బొండపల్లి మండలంలోని కొండకిండాంలో గల కోళ్ల ఫారంలో 106 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, కిండాం ఆగ్రహారం మామిడి తోటలో 43 క్వింటాళ్ల ిపీడీఎస్ బియ్యం అధికారులు గుర్తించారు. రేషన్ దుకాణాల్లో ఉండాల్సిన పీడీఎస్ బియ్యం కోళ్ల ఫారం, మామిడితోటల్లోకి తరలించడం సంచలనమైంది. అయితే ఈ సంఘటన జరిగి 24 రోజులవుతున్నా వ్యాపారులు ఏ రేషన్ షాపు నుంచి తరలించారనేది అధికారులు ఇంతవరకు తేల్చలేదు. ఎంతసేపు 6 ఎ కేసులు నమోదు చేశామని చెప్పడం తప్ప. వ్యాపారులకు సహకరించిన రేషన్ డీలర్ ఎవరనే వివరాలు అధికారులు వెల్లడించలేదు. అయితే పీడీఎస్ బియ్యం ఏ రేషన్ షాపు నుంచి వెళ్లాయన్న విషయం సివిల్ సప్‌లైస్ అధికారులకు తెలిసినప్పటికీ కూతమి నేతలు బయటకు చెప్పవద్దని ఆదేశించారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బయటకు చెప్పడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సంఘటన జరిగి ఇన్ని రోజులైనా సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతి లేని పాలన అందిస్తామని కూటమి నేతలు గొప్పలు చెబుతున్నారు. కానీ పీడీఎస్ బియ్యం తరలింపు ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా నోరు మెదపడం లేదు.
వ్యాపారులపై కోర్టులో కేసులు
పీడీఎస్ బియ్యం తరలించిన వ్యాపారులపై కోర్టులో కేసులు పెడతాం. బియ్యం తరలించిన రేషన్ డీలర్ల వివరాలు కూడా తెలిశాయి. వారిపై నిఘా పెట్టాం. వారిపై కూడా చర్యలు తీసుకుంటాం.
– కె.మధుసూదన్‌రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి