
విద్యార్థులకు వైద్య ‘పరీక్ష’..!
విజయనగరం ఫోర్ట్: కోరుకొండ సైనిక్ స్కూల్‌లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన రాత పరీక్షలో ఎంపికైన విద్యార్థులు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కోసం సోమవారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చారు. వీరికి వివిధ రకాల వైద్యపరీక్షలతో పాటు, కంటి, ఈఎన్‌టీ పరీక్షలు నిర్వహించి మెడికల్ సర్టిఫికెట్స్‌ను ఆస్పత్రి వైద్యులు జారీ చేయాల్సి ఉంది. వైద్య పరీక్షల కోసం ఒక్కో విద్యార్థి రూ.300 చలానా కూడా తీశారు. అయితే, ఆస్పత్రి సిబ్బంది కొందరు ఈ వ్యవహారంతో తలదూర్చారు. డబ్బుల ఆక్రమ వసూలే లక్ష్యంగా... అన్ని సేవలు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నా ప్రైవేటు ల్యాబ్‌లలో చేయించుకోవాలని సూచించారు. ఆ ల్యాబ్ సిబ్బందితో ముందస్తుగానే కమీషన్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. మొత్తం 90 మంది విద్యార్థులను ప్రైవేటు ల్యాబ్‌లకు పంపించి అక్కడ ఒక్కొక్కరి దగ్గర మరో రూ.450 నుంచి రూ.500 వసూలు చేశారు. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గోడు వినిపించినా పట్టించుకునేవారే కరువయ్యారు. మెడికల్ సర్టిఫికెట్ అత్యవసరం కావడంతో అడిగినంత ఇచ్చుకున్నారు.
అంతా ఆ ఇద్దరు ఉద్యోగుల కనుసన్నల్లోనే..
ఈ తతాంగాన్ని ఇద్దరు ఉద్యోగులు నడిపించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వజన ఆస్పత్రికి చెందిన ఒకరు, సైనిక్ స్కూల్‌కు చెందిన ఉద్యోగి ఒకరు విద్యార్థులను ప్రైవేటు ల్యాబ్‌లకు పంపించడంలో కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. దీనికోసం ల్యాబొరేటరీల నుంచి వారికి కమీషన్లు ముట్టాయన్న విమర్శలు ఉన్నాయి. మెడికల్ సర్టిఫికేట్స్ కోసం ఒక్కో విద్యార్ధి రూ. చలానాకు రూ. 300 , వైద్య పరీక్షలకు రూ. 500 వరకు వెచ్చించారు.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
సైనిక్ స్కూల్‌కు ఎంపికై న విద్యార్థులు మెడికల్ సర్టిఫికెట్స్ కోసం వచ్చారు. వైద్యపరీక్షలు అన్నీ ఆస్పత్రిలో ఉన్నాయి. వారిని ప్రైవేటు ల్యాబొరేటరీలకు ఎవరు వెళ్లమన్నారో తెలియదు. విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కామేష్, ఆర్‌ఎంఓ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి
సర్వజన ఆస్పత్రిలో వైద్యపరీక్షలకు వచ్చిన కోరుకొండ సైనిక్ స్కూల్
చిన్నారులు
సర్టిఫికెట్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.300 చొప్పున చలానా
అన్ని సేవలూ అందుబాటులో ఉన్నా ప్రైవేటు ల్యాబ్‌లో చేయించుకోవాలని సూచన
అక్కడ మరో రూ.450 నుంచి రూ.500 చొప్పున వసూలు

విద్యార్థులకు వైద్య ‘పరీక్ష’..!

విద్యార్థులకు వైద్య ‘పరీక్ష’..!