
అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు
విజయనగరం: రాష్ట్ర స్థాయి సీనియర్స్ సీ్త్ర, పురుషుల అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 14వ తేదీ నుంచి 15 వరకు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన పోటీల్లో విజయనగరం జిల్లా నుంచి 8 మంది క్రీడాకారులు ప్రాతినిథ్యం వహించి, ఐదు పతకాలు కై వసం చేసుకున్నారు. లాంగ్‌జంప్‌లో ఎ.లక్ష్మి బంగారు పతకం చేజిక్కించుకోగా... పి.వసంత 100 మీటర్ల పరుగు పోటీలో బంగారు పతకం, 200 మీటర్ల పరుగుపోటీలో వెండి పతకం దక్కించుకున్నారు. అదేవిధంగా ట్రిపుల్ జంప్‌లో ఎం.బాలరాజ్ బంగారు పతకం చేజిక్కించుకోగా... 3000 మీటర్ల పరుగు పోటీలో ఎస్. అశోక్ బంగారు పతకంతో రాణించాడు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు.