
ముత్తాయివలసలో ఏనుగుల సంచారం
బొబ్బిలి రూరల్: మండలంలోని ముత్తాయివలస, కలవరాయి గ్రామాల మధ్య ఏనుగుల గుంపు సంచరిస్తోంది. శనివారం రాత్రి సీతానగరం మండలం నుంచి తరలివచ్చి ఆదివారం ఉదయానికి ఇక్కడి గ్రామాల్లోని మామిడితోటలో తిష్ట వేశాయి. దీంతో అలర్ట్ అయిన ఫారెస్ట్ సిబ్బంది గ్రామానికి చేరుకుని గ్రామస్తులకు, అటుగా వచ్చే ప్రయాణికులకు పలు సూచనలు చేశారు. ఏనుగుల గుంపు వేరే ప్రాంతానికి తరలి వెళ్లేవరకు ఆయా గ్రామాలమీదుగా ప్రయాణికులు రాకపోకలు చేయకూడదని సూచించారు. కమ్మవలస సర్పంచ్ పిల్లా వసుంధర, ఫారెస్ట్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
పేలిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్
వీరఘట్టం: మండలంలోని చలివేంద్రి గ్రామంలో శనివారం పడిన పిడుగులకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ఉన్న ఇనుప రేకులు బద్దలు కావడంతో, లోపలున్న ఆయిల్ లీకై ంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే ట్రాన్స్‌కో ఏఈ అనిల్‌కుమార్ స్పందించి ఆదివారం సాయంత్రానికి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేశారు. అలాగే వీరఘట్టంలో పిడుగులు పడడంతో సిటీకేబుల్ వ్యవస్థ దెబ్బతిని, ప్రసారాలు నిలిచిపోయాయి.
గృహోపకరణాలు దగ్ధం..
సీతానగరం: మండలంలోని వివిధ గ్రామాల్లో శని, ఆదివారాల్లో కురిసిన ఉరుములు, పిడుగుల వర్షానికి గృహోపకరణాలు దగ్ధమయ్యాయి. మండల కేంద్రంలో 8 ఇన్వర్టుర్లు, 10 ఫ్యాన్లు, 4 టీవీలు కాలిపోయాయి. పలుచోట్ల వీధి దీపాలు కూడా కాలిపోయాయి.
విజయనగరం ఐటీఐలో జాబ్‌మేళా రేపు
విజయనగరం అర్బన్: ఐటీఐ అభ్యర్థుల కోసం ఈ నెల 17న స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తామని ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ టీవీ గిరి తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన రానె మద్రాస్ లిమిటెడ్ అనే సంస్థలో వివిధ కేడర్ పోస్టులకు ఆ రోజు ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. 2024వ విద్యాసంవత్సరంలో ఐటీఐ పాసై, ఈ ఏడాది ఆగస్టులో పరీక్షలకు హాజరు కాబోయే చివరి సంవత్సరం వె ల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్ ట్రేడ్ అభ్యర్థులు ఈ మేళాకు హాజరయ్యే అర్హత ఉందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్ధులు బయోడేటాతో పాటు ఒరిజనల్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, 2 పాస్‌పోర్టు ఫొటోలతో హాజరు కావాలని తెలియజేశారు. పూర్తి వివరాల కోసం ఫోన్ 8106025022, 9849944654 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
సంస్కృత కళాశాలలో
ప్రవేశాలు ప్రారంభం
విజయనగరం అర్బన్: పట్టణంలోని మహారాజా సంస్కృత కళాశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. దక్షిణ భారతదేశంలో పూర్తిగా ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న ఏకై క సంస్కృత కళాశాల ఇదే. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యార్థులకు ఉత్తమ విద్య అందిస్తోంది. నామమాత్రపు ఫీజుతో కోర్సులు అందిస్తారు. దూర ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వ వసతిగృహంలో సదుపాయాలు.. బ్రాహ్మణ విద్యార్థులకు సింహాచల దేవస్థానం ద్వారా ఉచితి భోజన సదుపాయం కల్పిస్తారు.
కోర్సులివే..
పదో తరగతి ఉత్తీర్ణులకు (ఐదు సంవత్సరాల ఇంటర్ కోర్సులు) పీడీసీ – తెలుగు, పీడీసీ – సంస్కృతం.. ఇంటర్మీడియట్ విద్యార్థులకు (ఓఎల్ కోర్సులు) బీఏ – తెలుగు, బీఏ – సంస్కృతం, బీఏ హిస్టరీ, బీఎస్సీ కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు అన్ని రకాల పోటీ పరీక్షలకు అర్హులవుతారని, ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.జనార్ధననాయుడు సూచించారు.

ముత్తాయివలసలో ఏనుగుల సంచారం