
క్రైమ్ కార్నర్..
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
పూసపాటిరేగ: మండల పరిధి గొల్లపేట సమీపంలో సర్వీస్ రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఆటో ఢీ కొనడంతో ఒకరు అక్కడకక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కిలుగుపేటకు చెందిన జీరు కనకారెడ్డి (41) ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం సీహెచ్ అగ్రహారం ఫ్‌లై ఓవర్ వద్ద కూరగాయల లోడు దించేసి తిరుగు ప్రయాణంలో పూసపాటిరేగ వెళ్తుండగా గొల్లపేట సమీపంలో నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో కనకారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య తోటమ్మ, కుమారులు రాము, రమణ ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. ఎస్సై ఐ. దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి ఆత్మహత్య
డెంకాడ: మండలంలోని అక్కవరం పంచాయతీ పరిధిలో గల ఓ లే అవుట్‌లోని విద్యుత్ స్తంభానికి ఉరిపోసుకుని బోర సూరిబాబు (35) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఎ.సన్యాసినాయుడు అందించిన వివరాలిలా ఉన్నాయి. భోగాపురం మండలంలోని సవరవల్లి పంచాయతీ పరిధి రామదాసుపేట గ్రామానికి చెందిన బోర సూరిబాబు వ్యాన్ డ్రైవర్‌గా పని చేసేవాడు. కొంతకాలం నుంచి ఎయిర్‌పోర్టుకు కూలీలను తీసుకువెళ్తున్న బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. 15 రోజులుగా ఈ పనికి కూడా వెళ్లకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. ఈనెల 14వ తేదీ రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన భర్త సూరిబాబును భార్య బోర గౌరి ప్రశ్నించింది. భోజనం చేయమని భార్య గౌరి చెప్పినా వినకుండా వెళ్లిపోయాడు. మరుసటి రోజు అక్కివరం పంచాయతీ పరిదిలోని ఒక లే అవుట్‌లోని విద్యుత్ స్తంభానికి ఉరిపోసుకుని ఉన్న సూరిబాబును స్థానికులు గుర్తించారు. భార్య గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి..
పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలోని బెలగాం రైల్వే స్టేషన్ శివారులో ఈ నెల 8న గాయాలతో పడిఉన్న గుర్తు తెలియని వ్యక్తిని స్టేషన్ మాస్టర్ శ్రీనివాసరావు గుర్తించి జీఆర్‌పీ పోలీసుల సహాయంతో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు రైల్వే హెచ్‌సీ రత్నకుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని జీఆర్‌పీ సిబ్బంది తెలిపారు.

క్రైమ్ కార్నర్..

క్రైమ్ కార్నర్..