
కాసులకా..? కార్యకర్తకా..?
బొబ్బిలి:
బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రతిపక్ష కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి అవిశ్వాస తీర్మానం నెగ్గేలా చేసిన కూటమి నాయకుల సీల్డ్ కవర్ రాజకీయాలు సోమవారం బహిర్గతం కానున్నాయి. డబ్బులిచ్చేవారికే పదవి దక్కుతుందా.. లేదంటే కౌన్సిలర్ల మాట నెగ్గుతుందా అన్నది సోమవారం ఉదయం 11 గంటలకు జరగనున్న ఎన్నికలో తేలనుందన్న చర్చ సాగుతోంది. నేనంటే నేనేనని ఇద్దరు ఆశావహులు బయటకు చెబుతున్నా లోలోపల మాత్రం నేను బలై పోను కదా అనే అనుమానాలు మాత్రం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువాలు వేసుకునేందుకు వెనుకడుగు వేయగా, మరికొందరు ప్రజల నమ్మకాన్ని తాకట్టు పెట్టిమరీ కండువాలు కప్పుకున్నారు. ఇప్పుడు కండువాల వెనుక పెద్దకథే నడుస్తోంది. కండువాలు వేసుకోని వారిని అవసరం తీరాక దూరం పెట్టాలని కూటమి నాయకులు నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. దీంతో అటు సొంత పార్టీలోనూ, ఇటు బయట పార్టీలోనూ పరువు పోయే పరిస్థితి ఎదురుకానుందని పట్టణ వాసులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్డీఓ జేవీఎస్‌ఎస్ రామ్మోహనరావు ఆధ్వర్యంలో జరగనున్న మున్సిపల్ సమావేశంలో చైర్మన్‌గా ఎవరికి ఓటువేయాలన్న విషయాన్ని ఇప్పటి వరకూ తేల్చిచెప్పని బేబీనాయన సమావేశానికి ముందు చెప్పనున్నట్టు సమాచారం. బేబీ నాయన చెప్పిన వారి పేరే సీల్డ్ కవర్‌లో ఉంటుందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. డబ్బులు ఖర్చు చేస్తున్న వ్యక్తికి చైర్మన్ గిరీని అప్పగిస్తారా? లేదంటే పార్టీ కోసం ఒకే చోట సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వ్యక్తికి అప్పగించనున్నారా ? అన్నది మీమాంసగా మారింది. పట్టణంలో టీడీపీ ఉనికికి ప్రశ్నార్థకంగా మారనున్న ఈ ఎపిసోడ్ సోమవారంతో ముగియనుంది.
నేడు బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక
అధికారుల సమక్షంలో
ఉదయం 11 గంటలకు చేతులెత్తే ప్రక్రియ