పూసపాటిరేగ ఏఎంసీకి...రాజకీయ గ్రహణం
పూసపాటిరేగ: నెల్లిమర్ల నియోజకవర్గంలో కొద్ది నెలలుగా జనసేన, టీడీపీ మధ్య సాగుతున్న ఆధిపత్యపోరు ప్రజలకు శాపంగా మారింది. అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. ప్రజాసమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ సేవలు సరిగా అందడం లేదు. పదవుల ఎంపిక, నిధుల కేటాయింపులోనూ నిర్లక్ష్యం ఆవహించింది. దీనికి పూసపాటిరేగ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎంపికలో జాప్యమే నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం ఏఎంసీ పాలక వర్గాలు నియామకాలు పూర్తయ్యాయి. పూసపాటిరేగ ఏఎంసీ పాలక వర్గం మాత్రం ఖరారు కాలేదు. కొన్నిరోజులు జనసేనకు చెందిన వ్యక్తికి ఏఎంసీ పీఠం కట్టబెట్టారని, మరికొన్ని రోజులు టీడీపీ అభ్యర్థిని నియమించారంటూ పుకార్లు రావడమే తప్ప, పాలకవర్గం కొలువుదీరలేదు. ఏఎంసీ చైర్మన్ పదవి జనసేనకు కేటాయించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పట్టుబడుతుండగా, టీడీపీకే కేటాయించాలని పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కర్రోతు బంగార్రాజు పైరవీలు సాగిస్తున్నట్టు సమాచారం. ఏఎంసీ చైర్మన్ పదవికి పూసపాటిరేగ మండలం చల్లవానితోట గ్రామానికి చెందిన జనసేన నాయకురాలు పతివాడ వరలక్ష్మి, డెంకాడ మండలం ఏపీఎస్పీ క్వార్టర్స్‌కు చెందిన టీడీపీ నాయకురాలు చిల్ల పద్మ, నెల్లిమర్ల మండలం దన్నానపేటకు చెందిన గేదెల గాయత్రి, పూసపాటిరేగ మండలం పేరాపురానికి చెందిన బొంతు ఉమా, చౌడువాడకు చెందిన పసుపులేటి లలితకళ పేర్లు వినిపిస్తున్నాయి. ఏఎంసీ పీఠం ఎవరు దక్కించుకుంటే వారే రాజకీయంగా నిలదొక్కుకుంటారన్న వాదన బలపడడంతో ఎవరికి వారే ఏఎంసీ చైర్మన్ పీఠం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇది రైతులకు ఇబ్బందిగా మారింది. సేవలు అందని ద్రాక్షగా మారాయి.
ఆదాయం ఘనం సేవలు శూన్యం
పూసపాటిరేగ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదాయం జిల్లాలోనే అన్ని వ్యవసాయమార్కెట్లు కంటె అధికంగా వస్తుంది. 2024–25 సంవత్సరానికి లక్ష్యం 1.67 కోట్లు కాగా రూ.1.69 కోట్ల ఆదాయం వచ్చినట్టు రికార్డులు చెబుతున్నాయి. 2023–24లో రూ.1.61 కోట్లు లక్ష్యం కాగా రూ.1.69 కోట్లు, 2022–23లో 1.20 కోట్లు లక్ష్యం కాగా 1.40 కోట్లు ఆదాయం వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంకంటే అధిక ఆదాయం వస్తున్నా ఇటీవల కాలంలో రైతులకు సరైన సేవలు అందడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏడుగురు సిబ్బంది ఉండాలి. కార్యదర్శి, సూపర్ వైజర్‌తోనే కాలం వెళ్లదీస్తున్నారు. కొన్నినెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. కూటమి సర్కారు వచ్చి సుమారు ఏడాది అవుతున్నా ఏఎంసీ సర్వసభ్య సమావేశం నిర్వహించలేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీకి వస్తున్న ఆదాయంపై పర్యవేక్షణ చేసే నాథుడే కరువయ్యారు. కమిటీకి వస్తున్న ఆదాయంతో మార్కెట్ కమిటీ ఉద్యోగుల జీతభత్యాలు మినహా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించ లేదు. ఇప్పటికై నా పాలకవర్గ నియామకం పూర్తిచేసి, రైతులకు సేవలందించే దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
జనసేన, టీడీపీ మధ్య ఆధిపత్య పోరు
నియామకం కాని ఏఎంసీ పాలక వర్గం
అధిక ఆదాయం వస్తున్నా సేవలు శూన్యం
ఇద్దరు ఉద్యోగులతోనే విధులు


