వైభవంగా సహస్ర దీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం కనులపండువగా జరిపించారు. వెండి మంటపంలో ఉన్న శ్రీ సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి, దీపారాధన మంటపంలో ఉన్న ప్రత్యేక ఊయలలో వేంచేపుజేశారు. అనంతరం దీపాలను వెలిగించి, స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహస్ర దీపాల శోభలో సీతారామస్వామికి ఊంజల్ సేవ జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్‌కుమార్, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
చితికిపోయిన చిన్నారి
● లారీ ఢీకొని బాలుడి దుర్మరణం
కొత్తవలస: తెల్లతెల్లవారగానే అప్పుడే నిద్ర లేచి అక్క పాల ప్యాకెట్‌కు వెళ్తోందని తాను కూడా వెంట వెళ్తానని ఏడేళ్ల బాలుడు మారాం చేసి అక్కతో పాటు వెళ్లాడు. పాల ప్యాకెట్ తీసుకుని అక్కాతమ్ముళ్లు రోడ్డు దాటుతుండగా యమపాశం రూపంలో దూసుకుచ్చిన భారీ లారీ బాలుడిపైకి వెళ్లడంతో శరీరం నుజ్జ నుజ్జుయి అక్కడికక్కడే మృతిచెందాడు. శుక్రవారం తెల్లవారుజూమున జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాలుడి తల్లి, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తవలస మండలంలోని అరకు–విశాఖ జాతీయ రహదారి కొత్తవలస ఫైర్‌స్టేషన్ సమీపంలోని జనార్దన్ లేవుట్‌లో గల సాయిసంపత్ అపార్ట్‌మెంట్‌లో వాణికుమారి ఇద్దరు పిల్లలతో కలిసి తన తల్లి వద్ద ఉంటోంది. ఇటీవల భర్తతో కలహాలు రావడంతో ఆమె పిల్లలతో వచ్చి తల్లి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఎప్పటిలాగానే కూతురు చందస్వి(9)నిని పాలప్యాకెట్ కోసం రోడ్డు అవతలి వైపు గల పాలబూత్‌కు పంపించగా తాను కూడా వెళ్తానని కుమారుడు లేఖనకుమార్ (7) అక్కతో పాటు వెళ్లాడు. పాలప్యాకెట్ కొని రోడ్డు దాటుతుండగా మితిమీరిన వేగంతో ఎస్‌కోట వైపు వెళ్తున్న భారీ లారీ ఢీకొట్టడంతో బాలుడు శరీరం ముక్కముక్కలై రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్లిన పాప జరిగిన విషయాన్ని తల్లి, అమ్మమ్మకు చెప్పడంతో వారు వచ్చి చూసేసరికి దారుణం జరిగిపోయింది. తల్లి వాణికుమారి గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడ ఉన్నవారిని కంట తడి పెట్టించింది. విషయం తెలుసుకున్న కొత్తవలస సీఐ షణ్ముఖ రావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేసి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వైభవంగా సహస్ర దీపాలంకరణ


