
వేతనదారులకు నీడ కరువు..!
ఈ చిత్రంలో మృతుడి పేరు గేదెల రామారావు. ఈయనిది గంట్యాడ మండలం నరవ గ్రామం. వారం రోజుల కిందట గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లాడు. ఉదయం 9.30 గంటల సమయంలో వడదెబ్బకు గురై సొమ్మసిల్లి పోవడంతో తోటి వేతనదారులు చికిత్స నిమిత్తం విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే రామారావు మృత్యువాత పడ్డాడు.
పనిముట్ల సరఫరా లేదు...
ఉపాధి వేతనదారులకు గునపాలు, పారలు, టెంట్లు గత కొన్నేళ్లుగా సరఫరా కావడం లేదు. వేతనదారులే వారికి కావాల్సిన గునపాలు, పారలు సమకూర్చుకోవాలి. తాటి ఆకు పందిళ్లను వేసుకోవాలని చెప్పాం. మంచి నీళ్లు కూడా వేతనదారులు తెచ్చుకోవాలి.
– ఎస్.శారదాదేవి, డ్వామా పీడీ
విజయనగరం ఫోర్ట్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తున్న జిల్లాలోని లక్షలాది మంది వేతనదారులు ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్నారు. పనులు చేసే చోట సరైన నీడ సదుపాయం లేక అవస్థలు పడుతున్నారు. అదే సమయంలో పని చేసేందుకు అవసరమైన పనిముట్లు గునపాం, పార వంటివి కూడా వేతనదారులే సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. గతంలో పనిముట్లు అందించే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తాగడానికి మంచినీళ్లు కూడా వేతనదారులే తెచ్చుకోవాల్సిన దుస్థితి. గతంలో వేతనదారులకు ఏదైనా గాయం అయితే ప్రధమ చికిత్స అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ కిట్టు పని చేసే ప్రదేశంలో ఉండేది. అది కూడా ప్రస్తుతం లేకుండా పోయింది. ఇలా గతానికి భిన్నంగా పని ప్రదేశంలో వేతనదారులు నానా అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో జాబ్ కార్డులు 3.85 లక్షలు
జిల్లాలో 3.85 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో యాక్టివ్ జాబ్ కార్డులు 3.53 లక్షలు ఉన్నాయి. వీటి పరిధిలో 6.08 లక్షల వేతనదారులు ఉన్నారు. వీరిలో యాక్టివ్ వేతనదారులు 5.95 లక్షలు ఉన్నారు. వీరు ఉపాధి పనులకు వెళ్తారు.
ప్రతీ గ్రూపునకు ఒక టెంట్ ఉండాలి
ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 8 వేల వరకు గ్రూపులు ఉన్నాయి. ప్రతీ గ్రూపునకు ఒక టెంట్ ఉండాలి. ప్రభుత్వం వీటిని సరఫరా చేయలేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో తాటి ఆకులతో పందిరి వేస్తున్నారు. కొన్ని చోట్ల అవి కూడా వేయడం లేదు. దీని వల్ల పని చేసి అలసటగా ఉన్న వేతనదారులకు సేద దీరడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో వేతనదారులు ఇబ్బంది పడుతున్నారు.
పనిముట్లు కూడా కరువే..
వేతనదారులు పని చేయడానికి అవసరమైన పనిముట్లు కూడా ప్రభుత్వం సరఫరా చేయడం మానేసింది. దీంతో ఉపాధి పని చేయడానికి అవసరమైన గునపాం, పారలు కూడా వేతనదారులే పనికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. ప్రతీ 10 మంది వేతనదారులకు 3 గునపాలు, 3 పారలు, నాలుగు తట్టలు ఉండాలి. వీటి సరఫరా నిలిచిపోవడంతో వేతనదారులు సొంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.
ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లూ కరువే..
ఉపాధి హామీ పథకంలో పనిచేసే సమయంలో వేతనదారుల్లో ఎవరికై నా గాయం అయితే ప్రధమ చికిత్స చేయడానికి ఫస్ట్ ఎయిడ్ కిట్టు అందుబాటులో ఉండేది. అయోడిన్, కాటన్, బాండేజ్, పారాసిటమాల్, డైక్లోఫినక్, ఎమాక్సిలిన్, కత్తెర తదితర మందులతో కూడిన ఫస్ట్ ఎయిడ్ కిట్టు పనిచేసే చోట అందుబాటులో ఉండాలి. అయితే వాటి సరఫరా కూడా ప్రభుత్వం నిలిపివేసినట్టు తెలుస్తుంది. దీంతో ఏదైనా గాయం అయితే గ్రామంలోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి.
ఓఆర్‌ఎస్ ద్రావణంపై అవగాహన తక్కువే..
ఎండలో పని చేయడం వల్ల వేతనదారులు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ. ఈ నేపథ్యంలో డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందేందుకు ఓఆర్‌ఎస్ ద్రావణం ఎంతగానో ఉపయోగపడుతుంది. పని చేసే చోట ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో లేవు. అయితే ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉన్న చోట కూడా చాలా మందికి అవగాహన లేక వాటిని వినియోగించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వారం రోజుల కిందట వేతనదారు
మృతి
పనిముట్లు కూడా కరువే..
గునపాలు, పారలు వేతనదారులు
తెచ్చుకోవాల్సిన పరిస్థితి
ఫస్ట్ ఎయిడ్ కిట్లు కరువే..
అవస్థలు పడుతున్న వేతనదారులు
జిల్లాలో జాబ్ కార్డులు 3.53 లక్షలు
జిల్లాలో వేతనదారులు 5.95 లక్షలు

వేతనదారులకు నీడ కరువు..!

వేతనదారులకు నీడ కరువు..!