
అనుకున్నది..అనుకున్నట్లే..!
● సర్వజన ఆస్పత్రిపై కూటమి సర్కార్ కుట్ర
● ఉన్న చోటే ఉంచే విధంగా మంత్రి శ్రీనివాస్ ఆదేశాలు
● వైద్యకళాశాల వద్దకు తరలించేందుకు నిరాకరణ
● వైద్య విద్యార్థులు, వైద్యుల అవస్థలు
పట్టించుకోని ప్రభుత్వం
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి విషయంలో కూటమి సర్కార్ అనుకున్న విధంగానే చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు వేసుకున్న స్కెచ్ ప్రకారమే ఏర్పాట్లు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిని ఉన్నచోటే శాశ్వతంగా ఉంచాలని కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది. వైద్యవిద్యార్థులు, వైద్యులు కష్టాలను సైతం పట్టించుకోవడం లేదనే ఆరోపణులు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా ప్రజల చిరకాల వాంఛను గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేరవేర్చింది. జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు ఎదురుచూశారు. కానీ ఎవరూ జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయలేదు. 2019లో అధికారం చేపట్టిన తర్వాత జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేసింది. గాజులరేగ సమీపంలో 70 ఎకరాల్లో ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు కాగా రూ. 500 కోట్లతో వైద్య కళాశాల, బోధనాస్పత్రి, హాస్టల్ భవనాలు నిర్మిస్తున్నారు. కళాశాల మంజూరు చేయడంతో పాటు వైద్య కళాశాల ప్రారంభం కూడా జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. మొదటి ఏడాది ఎంబీబీఎస్ తరగతులు కూడా ప్రారంభించేశారు. 150 మంది వైద్య విద్యార్థులకు వైద్య కళాశాల రావడం వల్ల సీట్లు లభించాయి. రెండో ఏడాది తరగతులు కూడా జరుగుతున్నాయి.
1500 పడకలతో విశాాలమైన
భవనాల నిర్మాణం
గాజులరేగ వద్ద నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో బోధనాస్పత్రి కోసం సువిశాలమైన భవనాన్ని నిర్మించారు. అందులో 1500 బెడ్స్ (పడకలు) సరిపడేలా భవన నిర్మాణం జరిగింది. ప్రస్తుతం సర్వజన ఆస్పత్రి, ఘోషాఆస్పత్రిలో కలిపి 500 పడకలు మాత్రమే ఉన్నాయి. దీంతో రోగులు అధిక సంఖ్యలో రావడం వల్ల అవి చాలడం లేదు. ఫలితంగా రోగులకు వరండాలో బెడ్స్ వేసి చికిత్స అందించాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఉండకూడదనే ఉద్దేశంతో అక్కడ అధిక సంఖ్యలో బెడ్స్ పట్టేవిధంగా భవనాన్ని నిర్మిస్తున్నారు. అయినప్పటికీ కూటమి సర్కార్ ఉన్న చోటే, వసతులు చాలక పోయినా సర్వజన ఆస్పత్రిని ఇక్కడే ఉంచేవిధంగా పట్టుబట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్లాది రుపాయలు వెచ్చించి భవనాలు నిర్మిస్తే అక్కడికి వైద్య కళాశాల తరలించబోమని కూటమి పాలకులు చెప్పడంపై జనం విస్తుపోతున్నారు.
వైద్యవిద్యార్థుల అవస్థలు
వైద్య కళాశాలకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉండడంతో ప్రతిరోజూ వైద్య కళాశాల నుంచి వైద్య విద్యార్థులు ఆస్పత్రికి వస్తున్నారు. దీంతో వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రెండూ ఒకేచోట ఉంటే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ప్రొఫెసర్లు కూడా వైద్య కళాశాలకు, సర్వజన ఆస్పత్రికి తిరగాల్సిన అవసరం ఉంటుంది. రెండూ ఒక చోట లేకపోవడం వల్ల వారు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. వారి అవస్థలను కూటమి సర్కారు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉన్న చోటే ఉంచాలని మంత్రి ఆదేశాలు
జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ సమీపంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఉంది. అక్కడే ఆస్పత్రిని ఉంచేందుకు అవసరమైన అవకాశాలను పరిశీలించాలని, 15 రోజుల్లోగా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులు, ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు కూడా అదే పనిలో నిమగ్నమయ్యారు. అధికారం చేపట్టిన నాటి నుంచి కూటమికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు ఆస్పత్రిని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించకుండా ఇక్కడే ఉంచేందుకు నిర్ణయించారు. ఇప్పడు బహిరంగగానే వారి అలోచనను బయట పెట్టేశారు.
వసతులు చాలక అవస్థలు
ప్రస్తుత ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యులకు, యంత్ర పరికరాలు అమర్చేందుకు పూర్తిస్థాయిలో వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. అన్ని విభాగాలకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఒకటి రెండు విభాగాలకు ఫ్రొపెసర్లు రావాల్సి ఉంది. గదులు చాలక ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఒకే గదిలో ఉండాల్సిన పరిస్థితి. ముఖ్యంగా యంత్ర పరికరాలు ఏర్పాటు చేయడానికి గదులు చాలక వైద్యాధికారులు తలలు పట్టుకుంటున్నారు.

అనుకున్నది..అనుకున్నట్లే..!

అనుకున్నది..అనుకున్నట్లే..!