
23.400 కేజీల గంజాయి పట్టివేత
కొత్తవలస: ఒడిశా రాష్ట్రం నుంచి అరకు, విశాఖపట్నం మీదుగా హైదరాబాద్‌కు కారులో 23 కేజీల,400 గ్రాముల గంజాయి తరలిస్తుండగా కొత్తవలస పోలీసులు మండలంలోని మంగళపాలెం జంక్షన్ సమీపంలో సోమవారం పట్టుకున్నారు. దీనికి సంబంధించి సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గంజాయి కారులో తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్సై మన్మథరావు తన సిబ్బందితో మంగళపాలెం జంక్షన్ వద్ద మాటు వేశారు. దీంతో ముందుగా పల్సర్ బండిపై ఒక వ్యక్తి వెళ్తుండగా పోలీసులు అనుమానం వచ్చి ఆపగా బైక్ అక్కడే వదిలేసి తప్పించుకుని పారిపోయాడు. ఈ దృశ్యాన్ని వెనుక ఫిఫ్ట్ డిజైర్ కారులో వస్తున్న వారు గమనించి కారు ఆపి పారిపోయేందుకు ప్రయత్నించగా అనుమానం వచ్చిన పోలీసులు కారులో గల ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేసి గంజాయి ఉన్నట్లు గుర్తించారు. కారు నాలుగు డోర్ల పై కవర్లు విప్పి అందులో 23 కేజీల,4వందల గ్రాముల గంజాయిని 48 ప్యాకెట్లుగా విభజించి దాచి యథావిధిగా డోర్స్ కవర్లు వేసి ఉండడం గమనించారు. దీంతో నిందితులను, కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించి తహసీల్దార్ బి.నీలకంఠరావు సమక్షంలో కారు డోర్లు తెరిచి అందులో గల గంజాయిని వెలుపలకు తీశారు. శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముధాలవలస మండలం పెద్దచెర్ల గ్రామానికి చెందిన పాలవలస జనార్దన్, పాలవలస రాంబాబులుగా నిందితులను గుర్తించారు. వారిని విచారణ చేయగా ఒడిశా రాష్ట్రంలో కొనుగోలు చేసి హైద్రాబాద్‌కు కారులో తరలిస్తున్నట్లు అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ వివరించారు.
పాచిపెంటలో 127 కేజీలు..
పాచిపెంట: కారులో అక్రమంగా తరలిస్తున్న 127 కేజీల గంజాయిని పాచిపెంట పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సాలూరు రూరల్ సీఐ రామ కృష్ణ సోమవారం పాచిపెంట పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. మండలంలోని పద్మాపురం జంక్షన్‌లో సోమవారం మధ్యాహ్నం అనుమానస్పదంగా ఓ కారు ఆగి ఉండడాన్ని గమనించిన స్థానిక వీఆర్వో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై వెంకట సురేష్ సిబ్బందితో వెళ్లి కారును పరిశీలించి, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించి స్థానిక రెవెన్యూ అధికారుల సమక్షంలో తూనిక వేసి స్వాధీనం చేసకుని కేసు నమోదు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

23.400 కేజీల గంజాయి పట్టివేత