
దాడితల్లి సిరిమానోత్సవానికి సర్వం సిద్ధం
బొబ్బిలి: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు దాడితల్లి సిరిమానోత్సవానికి సర్వంసిద్ధమైంది. తొలేళ్ల ఉత్సవాన్ని సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సిరిమానోత్సవాన్ని పక్కా ఏర్పాట్లు చేశారు. గొల్లపల్లిలోని పైల వీధిలో గద్దె ఉన్న ప్రాంతంలో అంగడి కట్టిన ఇంటి వద్ద పూజారి బత్తిన కృష్ణ సిరిమానును మంగళవారం సాయంత్రం 5 గంటలకు అధిరోహిస్తారు. గత 30 ఏళ్లుగా బత్తిన కుటుంబ సభ్యులే సిరిమాను పూజారిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
సిరిమానోత్సవానికి పటిష్ట బందోబస్తు
దాడితల్లి సిరిమానోత్సవానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. సిరిమాను తిరిగే ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు. డీఎస్పీ భవ్యారెడ్డి, సీఐ సతీష్‌కుమార్‌లతో బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. రోడ్ మ్యాప్‌ను పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలను తెలుసుకున్నారు. ఏంఎసీ కూడలి నుంచి కృష్టాపురం మీదుగా వాహనాల మళ్లింపు ఉంటుందని అధికారులు తెలిపారు. అనంతరం భక్తుల దర్శనాలు, ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ సావు మురళీకృష్ణారావుతో పాటు కమిటీ సభ్యులు మండల జనార్దనరావు, వజ్జి రవి, ఎస్.ఎస్.హేమంత్, స్థానిక పెద్దలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిరిమానోత్సవానికి 300 మంది పోలీసులను బందోబస్తు విధులకు నియమించామన్నారు. 90 సీసీ కెమెరాలతో నిఘా వేశామన్నారు. సోమవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు సిబ్బంది డ్యూటీలో ఉంటారన్నారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు సిరిమానోత్సవాన్ని వీక్షించవచ్చన్నారు. ప్రజలంతా పోలీసులు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలకు సహకరిస్తూ అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని సూచించారు.
300 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
90 సీసీ కెమెరాలతో నిఘా
ఏంఎసీ కూడలి నుంచి కృష్ణాపురం మీదుగా వాహనాల మళ్లింపు
ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ వకుల్‌జిందల్