బొబ్బిలి: పట్టణంలోని పీఏసీఎస్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా రైతులు పండించిన పెసలు, మినుము కొనుగోళ్లు చేపట్టి సకాలంలో చెల్లింపులు చేస్తామని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ఎన్.వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని పీఏసీఎస్ కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మినుములు క్వింటా రూ.7,400లు, పెసలు క్వింటా రూ.8,682లకు కొనుగోలు చేస్తామన్నారు. అయితే నాఫెడ్ విధించిన నిర్దిష్ట నాణ్యతా ప్రమాణాల నిబంధనల ప్రకారం పెసలు, మినుములను పై మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామన్నారు. ఇందులో మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా తన విధులను నిర్వర్తిస్తోందన్నారు. జిల్లాలో జామి మండలం విజినిగిరి, గంట్యాడ, గజపతినగరం, సంతకవిటి, బొబ్బిలి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు.
గోదాముల నిర్మాణానికి భూమి కొనుగోలు
మార్క్‌ఫెడ్ ద్వారా గోదాములను నిర్మించేందుకు బొబ్బిలి గ్రోత్ సెంటర్ సమీపంలోని జగనన్న కాలనీ వద్ద 5.19 ఎకరాల భూమిని గతంలో కొనుగోలు చేసినట్టు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. గొల్లపల్లి సర్వే నంబర్ 509–2లో గల ఈ భూమికి సంబంధించిన రూ.33,73,500 లను రెవెన్యూ శాఖకు చెల్లించామన్నారు. ఇప్పుడు మరోసారి దానిని గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు తహసీల్దార్ ఎం.శ్రీనుతో కలసి సర్వే చేసినట్టు చెప్పారు. పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ ద్వారా తెలియజేస్తామని చెప్పారు.
జిల్లాలో ఐదు మండలాల్లో కేంద్రాలు ప్రారంభించిన మార్క్‌ఫెడ్ మేనేజర్