నెల్లిమర్ల రూరల్: ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగించాలని ఆదర్శ పాఠశాలల రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ధర్మకుమార్ ఆదేశించారు. సతివాడ ఆదర్శ పాఠశాలను మంగళవారం సందర్శించారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. విద్యా ప్రమాణాలు పెంపొందించే దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణతకు కృషిచేయాలన్నారు. ఆదర్శ పాఠశాలలో ఆరు, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రవేశ ప్రక్రియను నిబంధనలుకు అనుగుణంగా చేపట్టాలన్నారు. శతశాతం ప్రవేశాలు జరిగేలా చూసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. వివిధ అంశాలపై ఆరా తీసి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శైలజ, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ధర్మకుమార్