విజయనగరం ఫోర్ట్: అంగన్‌వాడీ కేంద్రాలకు బుధవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు ఇన్‌చార్జి ఐసీడీఎస్ పీడీ జి.ప్రసన్న తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
ఇల్లు చిన్నది... బిల్లు పెద్దది
రాజాం: మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన నక్క లక్ష్మీనారాయణ తన కుమారుడి ఇంటిపై చిన్న గదిలో భార్యతో కలిసి నివసిస్తున్నారు. ఒక ఫ్యాను, రెండు లైట్లు, టీవీ మాత్రమే వినియోగిస్తున్నారు. కోడలు పద్మ పేరుతో ఉన్న విద్యుత్ కనెక్షన్‌కు ఫిబ్రవరి నెల విద్యుత్ బిల్లు రూ.1495.99 రావడంతో లబోదిబోమంటున్నారు. రూ.122 విలువ చేసే విద్యుత్ వినియోగిస్తే బిల్లు మాత్రం వేలల్లో వచ్చిందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదని, బిల్లు సరిచేయడంలేదని ఆరోపించారు. న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.