
జూడో విజేతలకు జేసీ అభినందనలు
విజయనగరం: జూడో రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన నెల్లిమర్ల కేజీబీవీ విద్యార్థినులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ తన చాంబర్‌లో మంగళవారం అభినందించారు. ఈ నెల 9న స్థానిక విజ్జి స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నెల్లిమర్ల కేజీబీవీకి చెందిన 8 మంది విద్యార్థినులు విజయవాడలో ఈ నెల 15.16 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందారు. విజేతల్లో జిల్లాకు చెందిన వై.అనూష 52 కిలోల విభాగంలో రెండోస్థానం, పి.జ్యోత్స్నరాణి తృతీయస్థానంలో నిలిచారు. బి.భార్గవి 63 కిలోల విభాగంలో రెండో స్థానంలో నిలవగా 70 కిలోల విభాగంలో పి.సత్య కూడా ద్వితీయస్థానంలో నిలిచింది. అదేవిధంగా వై.అనూష జాతీయ పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా వారిని జేసీ సేతుమాధవన్ అభినందించి, మరిన్ని విజయాలను సాధించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు, జీసీడీఓ మాలతి, నెల్లిమర్ల కేజీబీవీ ప్రిన్సిపాల్ బి.ఉమ, పీడీ ఎస్.రమ తదిరులు పాల్గొన్నారు.