
మందుబాబుల దుశ్చర్య
చీపురుపల్లి: పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. మందుబాబులు పూటగా మద్యం సేవించి రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో చీపురుపల్లి పట్టణంలోని రామాంజనేయకాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ప్రధాన కార్యాలయానికి ఆదివారం రాత్రి నిప్పుపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాఠశాల ఆవరణలో గుర్తుతెలియని యువకులు మద్యం సేవించారు. అనంతరం పాఠశాల రికార్డు గది తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. చోరీ చేసేందుకు ఏమీ దొరకకపోవడంతో బీరువాలకు నిప్పుపెట్టారు. ఈ ప్రమాదంలో రెండు బీరువాల్లో ఉన్న పుస్తకాలు, అడ్మిషన్ ఫారాలు, విద్యార్థులకు ఇచ్చే చిక్కీలు, బెల్లం ప్యాకెట్లు, గుడ్లు కాలిపోయాయి. రూ.లక్ష విలువైన మ్యాథ్స్, సైన్స్, స్పోర్ట్స్ కిట్లు కాలిబూడిదయ్యాయి. పాఠశాల కార్యాలయ గది నుంచి పొగరావడంతో సమీపంలో ఉన్న వసతిగృహ విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులు వచ్చి మంటలను అదుపుచేశారు. అడ్మిషన్ రిజిస్టర్లు భద్రపరిచిన బీరువా కాలిపోకుండా కాపాడగలిగారు. పాఠశాల హెచ్‌ఎం కంది గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గరివిడి ఎస్‌ఐ లోకేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీస్ క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
పాఠశాల కార్యాలయానికి నిప్పు
కాలి బూడిదైన మ్యాథ్స్, సైన్స్ కిట్లు, పుస్తకాలు, బీరువాలు
ఆధారాలు సేకరించిన క్లూస్ బృందాలు