
గురుకులాల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు
నెల్లిమర్ల: మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు, కళాశాలల్లో ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష దరఖాస్తు గడువు ఈ నెల 25వ తేదీ వరకు పెంచినట్టు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ కేబీబీ రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష మే 4న జరుగుతుందన్నారు.
28న తపాలా అదాలత్
విజయనగరం టౌన్: విశాఖపట్టణం పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా వినియోగదారుల ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు విశాఖపట్నంలోని పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయంలో 117వ తపాలా అదాలత్ నిర్వహించనున్నట్టు తపాలాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.వి.డి.సాగర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విజయనగం జిల్లా తపాల వినియోగదారులు తమ సమస్యలను ఈ 24వ తేదీలోగా ‘117వ తపాలా ఆదాలత్’, కె.వి.డి.సాగర్, అసిస్టెంట్ డైరెక్టర్, పోస్టుమాస్టర్ జనరల్ వారి కార్యాలయం, విశాఖపట్నం–530017 చిరునామాకు పంపించాలని కోరారు. గడువు తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించమని పేర్కొన్నారు.
వ్యవసాయ భూమికి
‘మార్గం’ చూపండి
విజయనగరం అర్బన్: భోగాపురం మండలంలో జాతీయ రహదారి నుంచి ఎయిర్‌పోర్టుకు నిర్మిస్తున్న అప్రోచ్ రోడ్డులో వ్యవసాయ భూమికి వెళ్లేందుకు ‘మార్గం’ చూపాలని గూడుపువలస, సవరవిల్లి, దల్లిపేట, బైరెడ్డిపాలెం, ఎ.రావివలస తదితర గ్రామస్తులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద కాసేపు ఆందోళన చేసి అనంతరం కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూమికి ఇరువైపులా నిర్మాణ సంస్థ ఫెన్సింగ్ వేస్తోందని, దీనివల్ల వ్యవసాయ భూములకు వెళ్లే మార్గం ఉండదన్నారు. అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూమిలో సర్వీసు రోడ్డు నిర్మించాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఆర్డీఓ కీర్తితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయా గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు.
ఎన్నికల ప్రక్రియను
బలోపేతం చేద్దాం
● రాజకీయ పార్టీలు బీఎల్‌ఏలను నియమించాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్: ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని, బూత్ స్థాయిలో బీఎల్‌ఏలను నియమించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. తన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు సంసిద్ధత అన్నది ప్రస్తుతం నిరంతర ప్రక్రియగా మారిందని చెప్పారు. ప్రతినెలా రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహిస్తామని, దీనివల్ల ఎన్నికల ప్రక్రియలో ఏమైనా లోటుపాట్లు గుర్తిస్తే సరిచేయడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. తప్పులు లేని ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడంలో రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో ఇన్‌చార్జి జేసీ శ్రీనివాసమూర్తి, ఎలక్షన్ సూపరింటెండెంట్ భాస్కరరావు, రాజకీయ పార్టీల నాయకులు వర్రి నరసింహమూర్తి, ఐవీపీరాజు, సతీష్‌కుమార్, ఎం.అప్పలసూరి, శ్రీనివాస్, కె.సోములు తదితరులు పాల్గొన్నారు.