అర్జీదారుల... అసంతృప్తి వేదిక | - | Sakshi
Sakshi News home page

అర్జీదారుల... అసంతృప్తి వేదిక

Mar 18 2025 10:00 PM | Updated on Mar 18 2025 10:00 PM

అర్జీ

అర్జీదారుల... అసంతృప్తి వేదిక

జీతాల కోసం

కలెక్టరేట్‌కు వస్తున్నాం...

జమ్ము పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్నాను. ఇచ్చేది నెలకు రూ. 6 వేలు జీతం. అది కూడా టైమ్‌కు ఇవ్వడం లేదు. సంక్రాంతి ముందు జీతాలు ఇప్పించాలని కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా వినతుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశాం. అప్పుడు జీతాలు ఇచ్చారు. తర్వాత నుంచి మూడు నెలలుగా మళ్లీ ఇవ్వట్లేదు. జీతాలు ఇప్పించాలని మళ్లీ కలెక్టర్‌కు విన్నవించేందుకు వచ్చాం.

– ఎస్‌.పార్వతి, ఆయా,

జమ్ము పాఠశాల, విజయనగరం

రెండుసార్లు ఫిర్యాదు చేసినా....

ఉపాధి హామీ పఽథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌)లో మన్యపురిపేట గ్రామంలో సీనియర్‌ మేట్‌గా నాలుగేళ్ల నుంచి పనిచేస్తున్నాను. గుర్ల మండల ఏపీవో కామేశ్వరావు నాకు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టు ఇస్తానని చెప్పి రూ.50 వేలు తీసుకున్నారు. పోస్టు నాకు కాకుండా వేరే మహిళకు ఇచ్చేశారు. నాకు న్యాయం జరుగుతుందనే ఆశతో కలెక్టరేట్‌కు రెండుసార్లు వచ్చి ప్రజా వినతుల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేశాను. ఫలితం కనిపించలేదు.

– గార రామలక్ష్మి, మన్యపురిపేట, గుర్ల మండలం

కలెక్టరేట్‌లో పిల్లలతో కలిసి అర్జీదారుల నిరీక్షణ

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

లెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘ప్రజా వినతుల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అర్జీల పరిష్కార ప్రక్రియ సంతృప్తికరంగా లేదనేది అర్జీదారుల ఆవేదన. అర్జీలు, ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత వాటి ఆన్‌లైన్‌ ప్రక్రియ వరకూ బాగానే జరుగుతోంది. తర్వాత వాటిని పరిష్కరించాల్సిన సంబంధిత అధికారికి చేరవేస్తున్నారు. అది ఆన్‌లైన్‌లో క్షణాల్లో వెళ్లిపోతుంది. కానీ పరిష్కారం విషయానికొచ్చేసరికే ఆలస్యమవుతోంది. ఫిర్యాదులు ఎలాంటివైనా వెంటనే ఏ వారానికావారం పరిష్కరించే చర్యలను క్షేత్రస్థాయి శాఖాపరమైన అధికారులు చేపట్టడం లేదని అర్జీదారులు వాపోతున్నారు. స్వల్ప వ్యవధిలో చేయదగిన పరిష్కారమైనా సరే గ్రేస్‌ పిరియడ్‌ అయ్యేంతవరకూ ఆ ఫైల్‌ను పరిశీలించట్లేదనే ఆవేదన అర్జీదారుల్లో కనిపిస్తోంది. తీరా గడువు ముగిసే సమయానికి తగిన పరిష్కారం చూపించకుండానే క్లోజ్‌ చేసేస్తున్నారు. రెండు మూడు సార్లు అర్జీలు పెడుతున్నవారిలో అలాంటి అర్జీదారులే ఎక్కువ.

32 శాఖల అధికారులకు మెమోలు...

‘స్పందన’ పేరుతో గతంలో ప్రజాసమస్యలను పరిష్కరించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కార్యక్రమం పేరు మార్చేశారు. 2024 జూన్‌ 15 నుంచి ‘ప్రజా వినతుల పరిష్కార వేదిక’ అనే పేరు కొనసాగిస్తున్నారు. ఈ పేరు మార్చడంలో చూపించిన శ్రద్ధ తర్వాత ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూటమి ప్రభుత్వ పాలకులు చూపించలేదు. ఉన్నతాధికారుల ఒత్తిడి అధికమవ్వడంతో జిల్లాలో పలు శాఖల అధికారులు హడావుడిగా అర్జీలను పరిష్కరించేస్తున్నారు. పరిష్కార శాతాన్ని పెంచాలని తప్పులతడకగా నివేదిక ఇచ్చేస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అర్జీదారుల సమస్యకు పరిష్కారం చూపించకుండానే తమ నివేదికలో మాత్రం పరిష్కరించినట్లు చూపించడంపై ఆయన గట్టిగానే అధికారులను నిలదీశారు. 32 శాఖల అధికారులకు మెమోలు కూడా జారీ చేశారంటే పరిస్థితి ఊహించవచ్చు. గత ఏడాది జూన్‌ నుంచి ఇప్పటివరకూ ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 38,238 వినతులు వచ్చాయి. వాటిలో 37,328 పరిష్కరించేశారు. ఇలా అధికారులు చూపిస్తున్న డేటా ప్రకారం దాదాపు 98 శాతం అర్జీలు పరిష్కారమైపోయినట్లే. పెండింగ్‌లో ఉన్నవి కేవలం 910 మాత్రమే. వాటిలో ప్రధానంగా 62 రెవెన్యూ శాఖ, 63 సర్వే శాఖ, 38 పోలీసు, 45 గృహనిర్మాణ శాఖ, 13 పంచాయతీరాజ్‌ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.

గంటల తరబడి ప్రయాణించి.. వ్యయప్రయాసలకోర్చి కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు వందలాది మంది అర్జీదారులు చేరుకుంటున్నారు. ఆన్‌లైన్లో తమ అర్జీలను నమోదుచేయిస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారులకు వినిపించి వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఉన్నతాధికారులు తమ గోడు విన్నారు.. పరిష్కరిస్తారని భావించిన అర్జీదారులకు అసంతృప్తి, ఆవేదనే మిగులుతోంది. సమస్య పరిష్కారానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న జాప్యం శాపంగా మారుతోంది. మళ్లీమళ్లీ ‘వేదిక’ మెట్లు ఎక్కాల్సి వస్తోంది.

ప్రజా సమస్యల పరిష్కార వేదికపై

సన్నగిల్లుతున్న నమ్మకం

అర్జీదారులకు దొరకని సృంతృప్తికర పరిష్కారం

ఒకే సమస్యపై పలు సార్లు

విన్నవించాల్సిన పరిస్థితి

ఉన్నతాధికారులు ఆదేశించినా కింది స్థాయి ఉద్యోగుల్లో వీడని నిర్లిప్తత

బాధ్యులైన అధికారులపై కలెక్టర్‌

అంబేడ్కర్‌ సీరియస్‌

32 శాఖల అధికారులకు

శ్రీముఖాలు!

ప్రచారం కొండంత... పరిష్కారం గోరంత...

ప్రజా వినతుల పరిష్కార వేదిక’కు ఒకసారి వచ్చిన అర్జీ మళ్లీ మరోసారి మరెక్కడి నుంచీ తిరిగి రాకూడదనే విధంగా పరిష్కారం చూపించాల్సి ఉంది. ఆ దిశగా అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడంలేదని అర్జీదారులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి అర్జీల్లో అధికంగా గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలోనే పరిష్కారమయ్యేవే ఉంటున్నాయి. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌ వరకూ అర్జీదారులు రావాల్సి వస్తుందంటే... జరగాల్సిన ప్రక్రియ సరిగా జరగలేదనే వాదనలకు ఉతమిస్తోంది. పింఛన్లు, రేషన్‌కార్డులకు విన్నపాలు, భూమిహక్కు వివాదాలు, పట్టాదారు పాసు పుస్తకానికి దరఖాస్తులు అధికంగా ఉంటున్నాయి. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపాలిటీ, విద్యుత్‌ శాఖలకు వచ్చే అర్జీల పరిష్కారం ఆలస్యమవుతోంది. అత్యధికంగా నమోదవుతున్న అర్జీల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి భూమి హక్కు పత్రాల్లో తప్పులను సరిదిద్దాల్సినవి, డీఆర్‌డీఏకు సంబంధించి పింఛన్ల మంజూరు, సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపికలో సాంకేతిక సమస్యలే ఉంటున్నాయి. వాటి పరిష్కారంపై సచివాలయం, మండల కార్యాలయాల స్థాయిలో అధికారులు శ్రద్ధ వహించట్లేదు. గ్రామ/వార్డు సచివాలయాలు, మండల కార్యాలయాలు, డివిజన్‌ స్థాయిలో వినతులు స్వీకరిస్తున్నప్పటికీ అక్కడ సత్వర పరిష్కారం రాకపోవడం వల్లే ప్రజలు అటువైపు మొగ్గు చూపించట్లేదు. నేరుగా కలెక్టర్‌ దృష్టిలో పెడితే తమ సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో కలెక్టరేట్‌లో ‘ప్రజా వినతుల పరిష్కార వేదిక’ వద్దకే అర్జీ పట్టుకొని వస్తున్నారు.

అర్జీదారుల... అసంతృప్తి వేదిక 1
1/3

అర్జీదారుల... అసంతృప్తి వేదిక

అర్జీదారుల... అసంతృప్తి వేదిక 2
2/3

అర్జీదారుల... అసంతృప్తి వేదిక

అర్జీదారుల... అసంతృప్తి వేదిక 3
3/3

అర్జీదారుల... అసంతృప్తి వేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement