
గంజాయి వ్యాపారులకు ఖబడ్దార్..!
విజయనగరం క్రైమ్: గంజాయి విక్రయించినా, అక్రమ రవాణా చేసినా, వినియోగించినా నేరమే. దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించి, చట్ట పరిధిలో కఠిన చర్యలు చేపడతామని మరోసారి ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఒకవైపు కఠినమైన చర్యలు చేపడుతూనే, మరోవైపు విద్యార్థులు, యువత, ప్రజలకు వాటి వల్ల కలిగే దుష్పప్రభావాలను వివరించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువతలో మార్పు తీసుకువచ్చి, వారిని తిరిగి సన్మార్గంలో నడపాలనే ఉద్దేశంతో వాటి దుష్పప్రభావాలను యువతకు వివరించే చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇక గతేడాదిలో గంజాయి అక్రమరవాణకు పాల్పడుతున్న వారిపై 62 కేసులు నమోదు చేసి, 1656 కిలోల గంజాయి, 70 గ్రాముల నల్లమందు స్వాధీనం చేసుకుని, 218మందిని అరెస్టు చేశామన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 24కేసులు నమోదు చేసి, 265కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 65 మందిని అరెస్టు చేశామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు గ్రూపులుగా ఏర్పడి, వ్యాపారాలు సాగిస్తున్న 54మందిని గుర్తించి, గంజాయి కేసుల్లో నిందితులుగా చేర్చామని చెప్పారు. వారిలో 43మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారన్నారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు జిల్లాలో ఐదు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం వాహన తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టామని అలాగే ప్రతిరోజూ పది ప్రాంతాల్లో డైనమిక్ వాహన తనిఖీలు చేపడుతున్నామన్నారు. అంతేకాకుండా, వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని గంజాయి వ్యాపారాలకు పాల్పడే వారిని ఎస్పీ హెచ్చరించారు.
ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరిక
ఈ ఏడాదిలో 24కేసుల నమోదు
265 కిలోల గంజాయి సీజ్