
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి
మెంటాడ: మండలంలోని రెల్లిపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు మృతురాలి మనుమరాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఆండ్ర ఎస్సై కె.సీతారాం తెలిపారు. ఈ ఘటనపై ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వృద్ధురాలు రాళ్లపూడి అంకమ్మ(74) ఒంటరిగా పూరిపాకలో నివసిస్తోంది. వృద్ధురాలు మృతి చెందినట్లు స్దానికులు గమనించి విశాఖపట్నంలో నివాసం ఉంటున్న మనుమరాలు పైల దుర్గకు సమాచారం ఇవ్వడంతో ఆమె వచ్చి మృతిచెందిన వృద్ధురాలి ముక్కు నుంచి రక్తం కారిన మరకలు ఉండడంతో పాటు ముక్కుకు ఉండాల్సిన బంగారు వస్తువులు, ఇంట్లో ఉండాల్సిన కొంత నగదు లేనట్లు గుర్తించి అనుమానాస్పద మృతిగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సంఘటనా స్దలాన్ని డాగ్‌స్కాడ్‌తో పాటు వేలిముద్రలు నిపుణులతో పరిశీలించి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.