● ఐదు బృందాలుగా 30మందితో టీమ్స్
● ఒక్కో బృందానికి ఒక్కో ఎస్సై నాయకత్వం
● టీమ్స్ పనితీరు చూసేందుకు అదనపు ఎస్పీ నియామకం
విజయనగరం క్రైమ్: ఆకతాయిల ఆట కట్టించేందుకు ‘శక్తి ‘ టీమ్స్‌ను ఏర్పాటు చేశామని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. జిల్లాలో మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకతాయిల వేధింపులను నియంత్రించేందుకు, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ’శక్తి’ యాప్ పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు శక్తి టీమ్స్‌ను నియమించామని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్‌తో ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం మమేకమై, వారు నిర్వర్తించే విధులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ శక్తి టీమ్స్ జిల్లాలోని కళాశాలలు, ముఖ్య కూడళ్లను మఫ్టీలో సందర్శించి, మహిళలను వేధించే ఆకతాయిలను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు చేపడతారన్నారు. విజయనగరం, బొబ్బిలి, రాజాంలలో ఆరుగురు పోలీసు సిబ్బందితో ఐదు బృందాలుగా 30మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేశామని, ఒక్కో బృందానికి ఒక్కో ఎస్సై నాయకత్వం వహిస్తారని చెప్పారు. ఈ బృందాలు మఫ్టీలో విధులు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ కోసం గతంలో ప్రత్యేకంగా కేటాయించిన ద్విచక్రవాహనాలను, ఫోర్ వీలర్స్ పెట్రోలింగ్ వాహనాలను వినియోగించాలని సూచించారు. ఆపద సమయంలో శక్తి యాప్‌కు వచ్చే ఎస్‌ఓఎస్ కాల్స్, డయల్ 112,100 కాల్స్‌ను బట్టి సంఘటన స్థలంకు వెళ్లే వారు తమతోపాటు ట్యాబ్‌లు కూడా వెంట తీసుకుని వెళ్లాలని, బాడీ వోర్న్ కెమెరాలను ధరించాలని సూచించారు. కాల్స్ వచ్చిన వెంటనే శక్తి బృందాలు అప్రమత్తమై సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యలను చట్టబద్ధంగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ శక్తి టీమ్స్‌ను ఆదేశించారు.
ప్రజల్లో అవగాహన కల్పించాలి
మహిళలకు రక్షణగా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి మొబైల్ యాప్ పట్ల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి, వారి మొబైల్స్‌లో యాప్ నిక్షిప్తం చేయడం, రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ఆపద సమయాల్లో శక్తి యాప్ ఏవిధంగా పని చేస్తుందన్న విషయాన్ని మహిళలకు వివరించాలని కోరారు. ఈ బృందాల పని తీరును జిల్లాలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత పర్యవేక్షిస్తారని, మహిళా పీఎస్ ఇన్‌స్పెక్టర్ నోడల్ అధికారిగా ఉంటారన్నారు. అంతేకాకుండా, శక్తి టీమ్స్ పని తీరును రాష్ట్ర డీజీపీ కార్యాలయం కూడా పర్యవేక్షిస్తుందని, వారి ఆదేశాల మేరకు చేయాల్సి ఉంటుందని శక్తిటీమ్స్‌కు ఎస్పీ విశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, మహిళా పీఎస్ సీఐ ఈ.నర్సింహమూర్తి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఆర్‌ఐ ఎన్.గోపాల నాయుడు, శక్తి టీమ్స్ సభ్యులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.