
పోలీసుల అదుపులో గంజాయి నిందితులు
● గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన
నిందితులు
● బొడ్డవర చెక్‌పోస్ట్ వద్ద కారు టైరులో
గంజాయి పట్టివేత
విజయనగరం క్రైమ్: గంజాయిని అక్రమంగా రవాణా చేసినా, అమ్మినా, కొనుగోలు చేసినా ఎన్డీపీఎస్ చట్టం ద్వారా కేసు నమోదు చేస్తామని ఎస్పీ వకుల్ జిందల్ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు నిందితుల ముఠాను ప్రవేశపెట్టారు. బొడ్డవర చెక్‌పోస్ట్ వద్ద వెహికల్స్ తనిఖీ చేస్తుండగా కారు వెనుక భాగంలో స్టెఫినీ టైరులో గంజాయిని తరలిస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఈ సందర్భంగా కేసు వివరాలను ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు. చెక్‌పోస్ట్ వద్ద ఎస్.కోట ఎస్సై ఎల్.చంద్రశేఖర్ వాహనాలు తనిఖీ చేస్తుండగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన కారు వెనక భాగంలో తనిఖీ చేస్తున్న సిబ్బందికి అనుమానం వచ్చి కారు స్టెఫినీని ఓపెన్ చేయగా డైబ్భె కిలోల గంజాయి 56 ప్యాకెట్లలో లభ్యమైందన్నారు. వెంటనే దానిని రవాణా చేస్తున్న ఒడిశాలోని మల్కన్‌గిరికి చెందిన రంజిత్ బిశ్వాస్, నిఖిల్ తపాయి, బిశ్వాస్ మహీధర్, యూపీకి చెందిన షా ఆలం, బెంగళూరుకు చెందిన షేక్ ఇజాజ్ అహ్మద్‌లను ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి ఒక కారు, నాలుగు మొబైల్ఫోన్స్, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయిని అక్రమ రవాణాపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ వెనకాడబోదని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.