
55 సెకెన్లలో హనుమాన్ చాలీసా పఠనం
విజయనగరం టౌన్: హనుమాన్ చాలీసా పఠించడంలో విజయనగరానికి చెందిన జయ పవన్ కల్యాణ్ ప్రపంచ రికార్డు సృష్టించారు. 55 సెకెన్లలో హనుమాన్ చాలీసాను పూర్తిగా పఠించినందుకు గాను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఈ మధ్య జరిగిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పోటీల్లో ఆయన పాల్గొని, హనుమాన్ చాలీసాను అతి తక్కువ నిడివిలో పూర్తిగా పఠించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. గతంలో బీహార్‌కు చెందిన అబ్బాయి 59 సెకెన్లలో హనుమాన్ చాలీసా పఠించగా ప్రస్తుతం ఆ రికార్డును తిరగరాసి 55 సెకెన్లలో హనుమాన్ చాలీసాను పఠించడం గొప్ప విషయం. విజయనగరం నగరపాలక సంస్థలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తాతబాబు కుమారుడు జయపవన్ కల్యాణ్. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడంతో జయ పవన్ కల్యాణ్‌కు అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసిన జయ పవన్ కల్యాణ్ అత్యంత సృజనను కనపరిచి ఈ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. ఈ మేరకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ వారు యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి అనేక సామాజిక మాధ్యమాల్లో జయపవన్ కల్యాణ్ సాధించిన రికార్డును నిక్షిప్తం చేశారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ప్రపంచ రికార్డు సాధించిన జయ పవన్‌కల్యాణ్