
అమ్మవార్ల ఉత్సవం ప్రారంభం
బొబ్బిలి: ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవతలు గొల్లపల్లి దాడి తల్లి అమ్మవారు, పాత బొబ్బిలి సరిపోలమ్మ ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేశమ్మ తల్లిని గొల్లపల్లి పాత బొబ్బిలి తదితర 12 గ్రామాల ప్రజలు దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆయా ఆలయాలు సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. గొల్లపల్లిలో దాడి తల్లి అమ్మవారి ఉత్సవ కమిటీ, పాత బొబ్బిలిలో అనువంశిక ధర్మకర్త జోడి గంజి రమేష్ నాయుడు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి సోమవారం ఉయ్యాల కంబాల ఉత్సవాలను నిర్వహిస్తారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు సిరిమాను ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఉత్సవాల సందర్భంగా కోలాటాలు, ప్రభల ఊరేగింపు నిర్వహిస్తారు.
స్టేజ్ ప్రదర్శనలు రద్దు
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సామూహికంగా ప్రజలు ఒకేచోట ఉండడం డీజేలు పెట్టడం, స్టేజీలపై సాంస్కృతిక ప్రదర్శనలు నిషేధమని సీఐ ఎం.నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఉత్సవ కమిటీలు, గ్రామపెద్దలు ఈ సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
విద్యార్థులకు కథల పోటీలు
గరుగుబిల్లి: మండల కేంద్రంలోని శాఖాగ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా ఆదివారం పలు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ మేరకు శాఖా గ్రంథాలయంలో విద్యార్థులకు కథలు, డ్రాయింగ్ తదితర పోటీలను నిర్వహించారు. వేసవి శిక్షణలో భాగంగా ప్రతి రోజు విద్యార్థులకు పోటీలు నిర్వహించడంతోపాటు మహనీయుల జీవిత విశేషాలను వివరించనున్నట్లు శాఖాగ్రంథాలయ నిర్వాహకుడు మధుసూదనరావు తెలిపారు.

అమ్మవార్ల ఉత్సవం ప్రారంభం