
వడదెబ్బ ముప్పు..
వృద్ధులకు..
● అప్రమత్తత తప్పనిసరి ● సమతుల ఆహారం తీసుకోవాలి ● ద్రవపదార్థాలు ఎక్కువగా సేవించాలి ● నీరసంగా ఉంటే వైద్యుడ్ని సంప్రదించాలి
వడదెబ్బ లక్షణాలు..
వడదెబ్బ తగిలిన వ్యక్తులు వెంటనే అపస్మారక స్థితికి చేరుకుంటారు. ముందుగా నీరసం, ఆయాసం, కళ్లు తిరగడం, వాంతులు, అలసిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత అపస్మారక స్థితికి చేరుకుంటారు. ఇలాంటి వారికి సకాలంలో వైద్యం అందించాలి. వైద్యుని వద్దకు తీసుకెళ్లే లోపే నీడలో పడుకోబెట్టి చల్లగాలి తగిలేలా చర్యలు తీసుకోవాలి.
ముందస్తు నివారణ చర్యలు..
వడదెబ్బ సోకకుండా ముందుస్తు నివారణ చర్యలు తీసుకోవడం ఉత్తమం. రోజుకి వివిధ రూపాల్లో 3 నుంచి 5 లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవాలి. మంచినీరు, కొబ్బరి నీరు, మజ్జిగ, పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా పదార్థాలు, మాంసాహారం వీలైనంతవరకు తగ్గించాలి. తేలికగా జీర్ణమయ్యే సమతుల ఆహార పదార్థాలు తీసుకోవాలి.
విజయనగరం ఫోర్ట్: ఎండతీవ్రత రోజురోజుకూ అధికమవుతోంది. వేడిమి ప్రభావం ఎక్కువగా వృద్ధులపై పడి వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో భానుడి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఏమాత్ర నీరసంగా ఉన్నా తక్షణమే వైద్యున్ని సంప్రదించాలి. 60 ఏళ్లు దాటిన వారు ఉదయం 8 గంటల్లోపు వ్యాయామం, నడక పూర్తి చేసుకోవాలి. మధుమేహంతో బాధపడేవారు వీలైనంత త్వరగా అల్పాహారం తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ బోళం పద్మావతి తెలిపారు.
కిడ్నీ, గుండె వ్యాధిగ్రస్తుల జాగ్రత్తలు..
ముఖ్యంగా వయస్సు మీద పడ్డవారికి ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం. వీరిలో అధికంగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు బారిన పడిన వారు ఎక్కువగా ఉంటారు. వారు వాడే మందుల మోతాదు, శరీర స్థితిగతులకు అనుగుణంగా వైద్యుల సూచనలు మేరకు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే శరీరంలో ఉప్పు శాతం తగ్గిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

వడదెబ్బ ముప్పు..