సంచార వాహనం

సంచార వాహనం వద్ద పశువులకు వైద్యం అందిస్తున్న వైద్యులు - Sakshi

పాడి రైతుకు వరం..

బొబ్బిలి: పాడిరైతులకు సహాయకారిగా మెలుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి మరింతగా అండదండలు అందించేలా నిర్ణయాలు తీసుకుంటోంది. పాడి రైతుల ఆవులు, గేదెలే కాకుండా వ్యవసాయానికి ఉపయుక్తమయ్యే ఎడ్లు తదితర మూగజీవాల వైద్యానికి జిల్లాలో ఉన్న సంచార వాహనాల సంఖ్యను పెంచింది. దీంతో ఆయా రైతులకు మరింత మేలు కలగనుంది. దీనివల్ల ప్రయోజనం పొందే రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ పశు ఆరోగ్య సేవా కేంద్రాలుగా సేవలందిస్తున్న ఈ వాహనాలతో పాడి రైతులకు ఎంతో మేలు కలుగుతుందనడంలో సందేహం లేదు.

ఇప్పటికే ఏడు వాహనాలు
జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలకూ ఒక్కోటి చొప్పున పశు చికిత్స సంచార వాహనాన్ని కేటాయించిన ప్రభుత్వం అందులో సిబ్బందితో పశువులకు చికిత్సలు, వైద్యం అందజేస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఒక్కో సంచార వాహనం పనిచేస్తోంది.

రెండో విడతలో మరో ఆరు వాహనాలు
గతంలో నియోజకవర్గానికి ఒక్కో వాహనం కేటాయించిన ప్రాంతాల్లో మరో వాహనం చొప్పున పక్కనే ఉన్న పశువైద్య కేంద్రానికి కేటాయిస్తారు.

196కు ఫోన్‌ చేయగానే..
ఆవులు, గేదెలకు ఆరోగ్య సమస్యలు తలెత్తినపుడు ఆయా పాడి రైతులు ఫోన్‌ నంబర్‌ 196కు ఫోన్‌ చేస్తున్నారు. వారికి కాల్‌ సెంటర్‌ నుంచి ఫోన్‌ చేసి సమస్యపై క్షుణ్ణంగా వివరాలు సేకరిస్తారు. ఆ వెంటనే పశువు దగ్గరకు వాహనం వెళ్లి సేవలందిస్తుంది. ఇందులో అన్ని రకాల సేవలందిస్తారు.

కదల లేని పరిస్థితుల్లో హైడ్రాలిక్‌ పరికరం
పశువులకు ప్రమాదాలు, లేదా ఇతర లేవలేని సేవలు అవసరమైన సమయంలో భారీ ఆకారం ఉన్న పశువులను కూడా సులువుగా లేపి చికిత్స చేసేందుకు హైడ్రాలిక్‌ పరికరాన్ని వాహనంలో ఏర్పాటు చేశారు. గతంలో ఆ పశువు వద్దకు వచ్చి తాళ్లతో కట్టి లేపే ప్రయత్నాలు చేసేందుకు రైతులు కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.నేరుగా పాడి రైతు ఇంటికి వచ్చి పశువును హైడ్రాలిక్‌ యంత్రపరికరంతో పైకి లేపి అవసరాన్ని బట్టి ఆస్పత్రికి కూడా తీసుకువెళ్తారు. వైద్య చికిత్స పూర్తయ్యాక తిరిగి రైతు ఇంటికే తీసుకువచ్చి పాడి పశువును అప్పగిస్తారు. ఇందుకోసం రైతులు ఏ విధమైన పైకం చెల్లించనక్కరలేదు. పూర్తి ఉచితంగా ఈ సేవలందిస్తారు.

ఈ కేంద్రాల్లో సంచార వైద్యం
గతంలో చీపురుపల్లి, నెల్లిమర్ల, బొబ్బిలి, ఎస్‌ కోట, గజపతినగరం. విజయనగరం, రాజాంలలో ఈ వాహనాలుండగా ఇప్పుడు కొత్తగా తెర్లాం, భోగాపురం, కొత్తవలస, గుర్ల, సంతకవిటి, గంట్యాడ ప్రాంతాలకు కొత్తగా వాహనాలను మంజూరు చేశారు. ఈ ప్రాంతాల్లో ఉండే వాహనాలు చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు వెళ్లి పశు వైద్యం అందేలా చర్యలు తీసుకుంటారు.

ఇప్పటివరకూ అందించిన చికిత్సలిలా..
వాహనాల ద్వారా జిల్లాలోని 27 మండలాల్లో ఉన్న 10,082 పశువులకు వైద్యం అందించగా అందులో శస్త్ర చికిత్సలు 45, రక్త పరీక్షలు187, పేడ పరీక్షలు 498, నాశిక పరీక్షలు 39, పాల పరీక్షలు 68, మూత్ర పరీక్షలు10 చేశారు. దీంతో ఆయా పాడి రైతులకు ప్రయోజనం కలిగింది.

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top